హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ అంటే కొత్త నిర్వచనం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు. బీజేపీ అంటే ‘బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ’ అని తనదైన శైలిలో నిర్వచించారు. రేపిస్టులను చేరదీయడం బీజేపీ నేతల మనస్తత్వానికి నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. ‘వెల్కం టూ అమృత్కాల్’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. బిల్కిస్ బానో రేపిస్టులు జైలు నుంచి విడుదలైనప్పుడు సంబరాలు జరుపుకున్నారని, పూలదండలు వేసి స్వాగతించారని, తాజాగా ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే బిల్కిస్ రేపిస్టును వేదికపై తమ పక్కన కూర్చొబెట్టుకున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. బిల్కిస్పై లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను గుజరాత్లోని బీజేపీ సర్కారు రెమిషన్పై విడుదల చేసింది.