హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. మీరు గుజరాత్కే కాదు.. దేశానికి కూడా ప్రధానినని గుర్తుంచుకోవాలన్నారు. గుజరాత్ పర్యటన సందర్భంగా ఓ పేదమ్మాయి మెడిసిన్ చదువుకు సాయం చేస్తానన్న ప్రధాని మోదీ 8 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ‘మోదీజీ.. మీరు గుజరాత్కే కాదు. భారతదేశానికి కూడా ప్రధాని. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు. కేంద్రం చర్యతో వైద్యవిద్యకు దూరమవుతున్న లక్షలాది మంది తెలంగాణ యువత పరిస్థితి ఏంటి. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.