రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మోదీని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో సరుకు రవాణా రంగం సమస్యలను అర్థం చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సరుకు లేదు. మాట్లాడితే ఇతరుల మీద నెపాన్ని తోసేస్తారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ.. పెట్రోల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో పన్నులు పెంచలేదు. కేంద్రమే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విధించి, రూ. 30 లక్షల కోట్లను తీసుకుంది. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా మొత్తం వారే తీసుకుంటున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
పెట్రోల్ ధరలు తగ్గించాలని ఒక ప్రెస్మీట్లో కేసీఆర్‌ను ఓ జర్నలిస్టు అడిగారు. పెంచిన సన్నాసే తగ్గించాలని కేసీఆర్ చెప్పారు. మోదీని డిమాండ్ చేస్తున్నా.. దోచుకున్నది చాలు.. ఇకనైన సెస్సులు రద్దు చేసి లీటర్ పెట్రోల్‌ను రూ. 70కి, లీటర్ డీజిల్‌ను రూ. 65కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రూడాయిల్ ధరలు మారలేదు. కానీ అడిషనల్ డ్యూటీలు, సెస్సులు వేసి సామాన్యుడి నడ్డీ విరగ్గొడుతున్నడని మోదీపై కేటీఆర్ మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు అన్నిరేట్లు పెరుగుతాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాటలు పెద్దవి పెద్దవి మాట్లాడారు. కానీ చేసిందేమీ లేదు. ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ రూపు రేఖలు మారుతాయా? అని ప్రశ్నించారు. సిలిండర్ ధర ఒకప్పుడు రూ. 400 ఇవాళ మాత్రం రూ. 1200లకు పెరిగింది. ఆయిల్ కంపెనీలకు రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చారు. ఆయిల్ కంపెనీలకు రాయితీలు ఇస్తావు.. ఆడబిడ్డలకు ఎందుకు రాయితీలు ఇవ్వరు అని ప్రశ్నించారు. ఉచిత పథకాలు మంచిది కాదని అంటారు. కానీ కార్పొరేట్ గద్దలకు పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ అదే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. అన్ని వర్గాలను మోదీ మోసం చేశారు. ఎనిమిదేండ్లలో మోదీ ఏం సాధించలేదు. దేశం కోసం మోదీ ఏం చేయలేదు. అన్ని కంపెనీలను అమ్ముతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఇవాళ పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి అవకాశాలు పెరుగుతున్నాయి. సరుకు రవాణా అవకాశాలు పెరుగుతున్నాయి. మరింత డిమాండ్ వస్తది మీ రంగానికి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఉత్పత్తి, సంపద పెరుగుతుంది. అందరూ బాగుంటారు. అందరి మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. చిల్లరమల్లర రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలి. లారీ డ్రైవర్లను, యజమానులను, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. మాకు పేదలు కావాలి.. పెద్దలు కావాలి. మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.