KTR | హైదరాబాద్ : కరెంట్ విషయంలో కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటే దిక్కు అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తమ మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిద్దరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సొంతింటికి తిరిగి వచ్చిన సత్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఎవర్నీ ఓన్ చేసుకోలేదు. అందరు నాయకులను దూరం చేసుకుంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎస్సార్ఎస్పీకి పునరుజ్జీవం పోసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ వరద కాలువ సజీవంగా మారిందంటే కాళేశ్వరం వల్లనే. పెద్దపల్లి నియోజకవర్గం కూడా సస్యశ్యామలంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎక్కడ చూసిన పచ్చగా మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
50 ఏండ్లుగా ఏమీ చేయలేని కాంగ్రెస్ మళ్లీ ఒక్క ఛాన్స్ అంటోంది అని కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ రైతులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారు. మొసళ్లను తీసుకెళ్ళి సబ్ స్టేషన్లో వదిలిపెట్టారు అక్కడి రైతులు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే 3 గంటల కరెంటే దిక్కు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నాం. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.