Minister KTR | మంచిర్యాల/ కరీంనగర్ అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో బిల్డర్ల నుంచి వసూలు చేసే సొమ్ముతో తెలంగాణ ప్రజలను కొనాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించబోవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన కారు గుర్తు నాయకుడు ఇటువైపు.. దశాబ్దాల సమస్యను అట్లే విడిచిపెట్టన బేకార్ గాళ్లందరు అటు దిక్కున ఉన్నారని అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని.. ఎక్కడ ఎవరు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.
ఇటీవల బెంగళూరు నుంచి కొందరు వచ్చి తనను కలిశారని, కర్ణాటకలో బిల్డర్ల దగ్గర చదరపు అడుగుకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆపైసలతో ఇక్కడి ప్రజలన్ని కొనేసి ఆగం చేయాలని చూస్తున్నదని చెప్పారని కేటీఆర్ తెలిపారు. మా తెలంగాణ అమ్ముడుపోయేది కాదని తాను వారితో చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వందలకోట్ల దొంగసొమ్ము తెచ్చినా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచో, ఢిల్లీ నుంచో తెచ్చి పంచే పైసల్ని బరాబర్ తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు. 60 ఏండ్లపాటు మనకు తాగునీరు, కరెంటు లేకుండా సావగొట్టిన కాంగ్రెస్ ఈరోజు మళ్లీ వచ్చి మాటలు చెబుతున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వారిని నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని, మేకల మందకు తోడేళ్లను కాపలాపెట్టుకున్నట్టే అవుతుందని హెచ్చరించారు. ఆరు దశాబ్దాలు సావగొట్టినోళ్లు ఇవాళ వచ్చి గ్యారెంటీ అంటే నమ్మి ఆగం కావొద్దని సూచించారు. 150 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 100 ఏండ్ల క్రితమే ముగిసిందని తెలిపారు. వారు ఇచ్చే ఆరు హామీలు ఏమోగానీ.. మూడు గంటల కరెంటు మాత్రం పక్కా అని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల జంగ్ సైరన్‌కు రాష్ర్టాలే దిగొచ్చాయి
స్వరాష్ట్రంలో సింగరేణి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈసారి దీపావళికి సింగరేణి కార్మికుల ఖాతాల్లో ఏకంగా రూ.1000 కోట్లు పడుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి పాటుపడుతున్నది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. నాడు సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ ఇస్తే దక్షిణాది రాష్ర్టాలు దిగివచ్చాయని, దెబ్బకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగివచ్చే పరిస్థితి సృష్టించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ 14 హామీలు ఇస్తే అన్నింటినీ అమలు చేశారని తెలిపారు. కేసీఆర్ ఉద్యమ జెండా ఎగరేసినప్పటి నుంచి పోరాటానికి అండగా నిలిచింది సింగరేణి, ఆర్టీసీ కార్మికులేనని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సింగరేణి దశ తిరిగిందని, నవరత్నాలు, మహారత్నాలకు దీటుగా బ్రహ్మాండగా వెలుగుతున్నదని అన్నారు. ఉత్పత్తి, లాభాల్లో సింగరేణి రికార్డులను బద్దలు కొడుతున్నదని కొనియాడారు. 2014లో లాభాలు 419 కోట్లు ఉంటే ఈరోజు రూ.2,222 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.
అప్పుడు 18శాతం.. ఇప్పుడు 32శాతం
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 18 శాతం మాత్రమే కార్మికులకు వాటా ఇస్తే.. ఇప్పుడు చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 32 శాతం వాటా ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. రూ.711 కోట్లను ఈసారి లాభాల్లో వాటాను కార్మికులు అందుకుంటున్నారని తెలిపారు. దీంతోపాటు దీపావళి బోసన్ కలుపుకొని చూస్తే రూ.1000 ఒకే సంవత్సరంలో కార్మికుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. సింగరేణి కార్మికులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, కమిట్మెంట్, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలన్న ఆలోచన దేశంలో ఏ నాయకుడికైనా ఉందా? రాహుల్ గాంధీకి ఉందా? నరేంద్రమోదీకి ఉందా? ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం కేసీఆర్ వాటిని అధిగమించి 15,400 వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. 520 మంది డిస్మిస్డ్ కార్మికులను వెనక్కి తీసుకున్నామని గుర్తు చేశారు.
వీటితోపాటు కొత్తగా నాలుగువేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఒక్క రామగుండం నియోజకవర్గంలోనే 576 ఎకరాల్లో 5 వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా? రామగుండం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల వస్తుందని అనుకున్నారా? అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల బిడ్డలు ఈరోజు కార్మికులే కావాల్సిన అవసరం లేదని, డాక్టర్లు కావాలంటే.. మీ పరిధిలోనే మెడికల్ కళాశాల ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో కార్మికుల పిల్లల కోసం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌ను జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో, పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వెంకన్నా.. డౌట్ ఉంటే పోయి కరెంట్ తీగలు పట్టుకో
ఈ రోజు ఒక కాంగ్రెస్ ఆయన అనుమాన పడుతున్నడు.. యాడ వస్తుంది 24 గంటల కరెంట్.. ఎక్కడ వస్తుందో చూపెట్టు.. నేను రాజీనామా చేస్తా అంటున్నడు. నేను ఆ కాంగ్రెస్ ఎంపీ వెంకట్‌రెడ్డికి ఒక్కటే చెప్తున్నా.. వెంకన్నా, నీకు బాగా అనుమానం ఉన్నది కదా. మా చెన్నూర్ నియోజకవర్గానికి రా.. ఏ ఊరుకుపోతవో పో.. నీ ఇష్టం ఉన్న సమయానికి రా.. మీ లోకల్ కాంగ్రెస్ వాళ్లందరినీ తీసుకుపో. అందరు కలిసి మీకు బుద్ధి పుట్టిన టైమ్‌కు రండి.. వచ్చి కరెంట్ తీగలు గట్టిగా పట్టుకోండి.. కరెంట్ వస్తుందో లేదో మీకే ఎరుకైతది. దేశానికి దిక్కుమాలిన కాంగ్రెసోళ్ల దరిద్రం కూడా పోతది.