హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, దేశాన్ని అథోగతిపాలు చేసిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటూ సబ్ కా సత్తేనాశ్ చేసిందని మండిపడ్డారు. బీజేపీ అసమర్థ విధానాల వల్లనే దేశ ఆర్థికాభివృద్ధి మందగించిందని ఆరోపించారు. ప్రజలపై పన్నులు వేయటమే పరిపాలన అని ప్రధాని మోదీ భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను రోజూ పెంచుతూ కోట్లమంది ప్రజలను బీజేపీ పీల్చి పిప్పిచేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ఆర్థిక విధానాలు, చమురు ధరల పెంపును నిరసిస్తూ మోదీ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకొన్న మోదీ అధికారంలోకి రాగానే మోయలేని ధరల భారం మోపి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. తన అసమర్థ పనితీరు, వైఫల్యాలపై ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చమురు ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజలు ధర్మ సంకటాన్ని వీడి కేంద్రంపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
మీ పాపాన్ని రాష్ర్టాలపై నెడుతారా?
చమురు ధరలను నిరంతరం పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పాపాన్ని రాష్ట్రాలపై నెట్టే కుటిల ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కరోనా సంక్షోభంతో ప్రజల ఉద్యోగాలు పోయి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో కూడా కేంద్రం పెట్రో ధరలను పెంచిందని విమర్శించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకొనే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని మండిపడ్డారు. ముడి చమురు ధరల పెరుగుదల అని ఒకసారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అని మరోసారి బీజేపీ నేతలు కహానీలు చెప్తున్నారని విమర్శించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లో ధరలు పెరుగుతున్నాయని చెప్తున్న కేంద్ర మంత్రులు, అకడ లీటర్ పెట్రోల్ ధర మనకంటే తకువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారని మండిపడ్డారు. మన పొరుగున ఉన్న అనేక దేశాలతోపాటు అర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ అత్యంత తక్కువ ధరకే పెట్రో ఉత్పత్తులు లభిస్తున్నాయని తెలిపారు.
రూ.28 పన్నులో రాష్ర్టాలకు ఇచ్చేది ఆఠానా మాత్రమే
2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉండగా, మోదీ ప్రభుత్వం దాన్ని రూ.32.98కు పెంచి నిరుడు కాస్త తగ్గించి రూ.27.90 చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పన్నులో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్ర మంత్రులతోపాటు వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం వసూలు చేస్తున్నదాంట్లో రాష్ట్రాలతో పంచుకొనేది బేసిక్ పన్ను మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.40 మాత్రమేనని, ఇందులోనుంచి 41 శాతం అంటే అక్షరాలా 57 పైసలు మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నదని వివరించారు. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం అంటే లీటర్‌కు 0.01 పైసలు మాత్రమేనని పేర్కొన్నారు. రూ.28 ఎక్సైజ్ డ్యూటీ ముకుపిండి వసూలు చేస్తున్న కేంద్రం, అందులో ఆఠానా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకొంటున్నదని విమర్శించారు.
అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్
కేంద్రం 2014 నుంచి పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి వ్యాట్‌ను నయాపైసా పెంచలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్రో ధరలు పెంచి ప్రజల జేబులు కొల్లగొడుతున్న బీజేపీ తెచ్చింది అచ్చేదిన్ కాదని, అందర్నీ ముంచే దిన్ అని విమర్శించారు. ఇటీవల నాలుగు రాష్ర్టాల్లో గెలిపించినందుకు ప్రజలకు ధరల పెంపు రూపంలో బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. పెట్రో ధరలను ప్రతిసారీ రాజకీయ అంశంగా వాడుకొంటున్న బీజేపీ, ఎన్నికల తర్వాత కర్కశంగా ధరలు పెంచుతున్నదని ఆరోపించారు. గత 15 రోజుల్లో 13 సార్లు చమురు ధరలు పెంచిందని విమర్శించారు. ‘లోక్‌సభలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి మనం కేవలం ఒక శాతం కన్నా తకువ ముడి చమురు దిగుమతి చేసుకొంటున్నాం. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే అత్యధికంగా దిగుమతి అవుతున్నది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో మనకు చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. పదేపదే అబద్ధాలు చెప్పి బీజేపీ నేతల నాలుకలు సిగ్గుపడుతున్నాయి’ అని విమర్శించారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.
రూ.30 సెస్సులో రాష్ర్టాలకు దక్కేది గుండు సున్నా
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలకు తెరలేపారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పెట్రో ధరల పెంపుతో కేంద్ర ఖజానా మాత్రమే నిండేలా పన్నులను కాకుండా సెస్సుల రూపంలో ధరలు పెంచుతున్నారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.18, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి పేరిట రూ.2.5, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రూ.11.. ఇలా ప్రతిదానికి ఒకో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా లీటర్ పెట్రోల్‌పై రూ.30కి పైగా సెస్సు వసూలు చేస్తున్నదని తెలిపారు. ఈ సెస్సులో రాష్ట్రాలకు దకేది గుండు సున్నా అని కేటీఆర్ చెప్పారు.
ఎవరికోసం ఈ పెంపు?
2014లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర 105 డాలర్లు ఉండగా, ఆ తర్వాత 40 డాలర్లకు పడిపోయింది. అయినా మోదీ సర్కారు పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజలపై మోదీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సమయంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే నిదర్శనమని పేర్కొన్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో బ్యారల్ ముడి చమురు ధర 20 డాలర్ల కంటే దిగువకు పడిపోయిన సమయంలో పెట్రో ధరలు తగ్గాలింది పోయి పెరిగాయి. తగ్గిన ధరల ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా ఎక్సైజ్ సుంకాన్ని రూ.20 పెంచింది. 2014లో లీటర్ పెట్రోల్ రూ.70.51, డీజిల్ రూ.53.78 ఉంటే, నేడు పెట్రోల్ రూ.118.19, డీజిల్ రూ.104.62కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారల్‌కు 106 డాలర్లు ఉన్నది. 2014 లో కూడా ఇంచుమించు ఇంతే ఉన్నది. కానీ పెట్రోల్ ధర ఇప్పుడు రెట్టింపు అయింది. ఏ ప్రయోజనాల కోసం ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు? దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నరేండ్లలో రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను భారం మోపింది. సగటున ఒక్కో కుటుంబం నుంచి రూ.1 లక్ష దౌర్జన్యంగా లూఠీ చేసింది. ప్రతిదీ దేశం కోసం, ధర్మం కోసమే అని చెప్పుకొనే బీజేపీ ప్రభుత్వం, ఈ దోపిడీ కూడా దేశం కోసం ధర్మం కోసమేనా? చెప్పాలి’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వంటగ్యాస్ బండ ప్రజలకు మోయలేని గుదిబండగా మారిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని తాకాయని ఆవేదన వ్యక్తంచేశారు.