హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమకు సానుకూల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామితోకలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.
కేసీఆర్‌ను అవహేళన చేసిన వాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు. వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలు బయటపెడుతామన్నారు. బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైనైనా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
2022 వరకు అందరికీ ఇండ్లు ఇస్తామని మోదీ చెప్పారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. మోదీ మాత్రం రూ. 435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారని కేటీఆర్ వెల్లడించారు. నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయి. జన్ కీ బాత్ వినరు.. మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని ఎద్దెవా చేశారు. సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని నిరూపించారని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించామని చెప్పారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ చూసి ఎనిమిదేండ్లలో ఏం చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎండగట్టడమే తమ వ్యూహం. దివాళా కోరు.. పనికి రాని ప్రధాని మోదీ అని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం ప్రతి రంగంలో విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత్ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు, ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. ఎస్సీలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న లిబరేషన్ డే అయితే ఆగస్టు 15 ఎందుకు కాదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.