హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుంది అని కేటీఆర్ అన్నారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది. తెలంగాణలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి లక్ష ముప్ఫై మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్రానికి రూ. 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది. తద్వారా సుమారు 16 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో టీఆర్ఎస్ చిత్తశుద్ధిపై, ఉపాధి అవకాశాల్లో బీజేపీ వైఫల్యాలపై కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ కల్పనలో మేం సాధించిన అత్యద్బుత విజయాలు మీకు తెలిసినవే అయినా తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో డ్రామా దీక్షకు దిగారు. మీ కోసం మళ్లీ ఆ విజయాలను క్లుప్తంగా గుర్తు చేస్తాను అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
‘ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి లక్ష ముప్ఫై మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది మా టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా… విప్లవాత్మకమైన టియస్ ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన చేసింది మేము కాదా… వచ్చిన ఉద్యోగావాకాశాలను తెలంగాణ యువతకు దక్కేలా ప్రత్యేక శిక్షణ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ని ఏర్పాటు చేసి మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది మేము కాదా… టీఎస్ ఐపాస్ లెక్కలోకి రాని మరెన్నో లక్షల ఉద్యోగాలను ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా సృష్టించినది మేము కాదా… స్వయం ఉపాధి కార్యక్రమాలతోపాటు పారిశ్రామిక యూనిట్లు పెట్టుకునే వారికోసం టీఐడియా, టీప్రైడ్ వంటి విధానాలతో ప్రోత్సాహిస్తున్నది మేము కాదా… ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే కోట్లాది మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేత చేసింది మేము కాదా… గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ చదువుకున్న నిరుద్యోగ సోదరీసోదరులతోపాటు, కులవృత్తులపైన ఆధారపడిన లక్షలమందికి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టినది మేము కాదా..?’ అని కేటీఆర్ అడిగారు.
వాస్తవాలు ఇలా ఉంటే వాటిని జీర్ణించుకోలేక బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ర్ట యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించి వారి జీవితాలను నాశనం చెయ్యడానికి పూనుకుంటున్న మీకు ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో మీ వైఖరిని రాష్ర్ట యువత తరపున నిలదీస్తున్నాను. దమ్ముంటే నేను లేవనేత్తె ఈ అంశాలపైన స్పందించాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు.
దేశానికీ, యువతకూ ‘అచ్చే దిన్’ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మీ బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మీ హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా…? ఏం వివరాలు అడిగినా డేటా లేదు.. తెలియదు గుర్తులేదు.. మర్చిపోయాం అని తప్పించుకుని తిరిగే No Data Available(NDA) సర్కార్ కదా మీది. మీరు సమాధానం చెప్పలేరు. లెక్కా పత్రం లేని… జవాబుదారీతనం లేని దిక్కుమాలిన పాలన చేసే మీరు మమ్ముల్ని ప్రశ్నించడమా? పక్కాగా లెక్కలు చెప్పే పారదర్శక పద్దతి మాది. ఎన్ని నోటిఫికేషన్లు వేసామో.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో డిపార్ట్మెంట్ల వారీగా వివరాలన్నీ ప్రజల ముందు ఉంచిన మా నిబద్దత ముందు పకోడీలు వేసే పనిని ఉద్యోగంగా చూపిన మీ మోడీ పాలన సాటికి వస్తుందా… అని కేటీఆర్ అడిగారు.
కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మీ పార్టీ ప్రభుత్వం వల్ల తెలంగాణ యువతకు అందిన పిసరంత సాయమేమైనా ఉందా? మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా , యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా హైదరాబాదును ఇన్వెస్టర్ల డెస్టినేషన్ గా మలుస్తున్న ప్రభుత్వం మాది. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది మేమైతే, ఇక్కడి యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సర్కారు మీది. కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా? లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి…మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుంది. తెలంగాణ యువత మీద మాకున్నది పేగు బంధం ప్రేమ. మీలాగా ఓట్ల డ్రామా కాదు. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చిన భూమిపుత్రుల ప్రభుత్వం మాదైతే కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించకుండా నెలలకు నెలలు ముప్పుతిప్పలు పెట్టిన కుటిల నీతి, కపట కేంద్ర ప్రభుత్వం మీది! అని కేటీఆర్ దుయ్యబట్టారు.
యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది. మీ బీజేపీ పాలిత యూపీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పిడికెడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లక్షల మంది నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసిన దుర్మార్గం కనిపించని కళ్లులేని కబోదులు మీరు. సాఫీగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టిన మీ డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా… ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమను, ఉద్యోగులను అదుకునేందుకు అర్ధిక ప్యాకేజీలిస్తే… 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా..
సర్కారువారి పాట బెట్టి మీ ఘనమైన మోడీగారు.. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? అని మంత్రి పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్/ సీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన మీది కాదా.. ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు పరం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల రిజర్వ్ డ్ జాబ్స్ ఎగరగొట్టిన పాపం మీకు కాక ఇంకెవ్వరికి తగులుతుంది? ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ మాదిరి పాలన చేస్తూ ఉన్న వాటిని అమ్ముకుంటున్న మీరెక్కడా.. ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా.. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ… ఇక్కడ ఒక సూటి ప్రశ్న – తెలంగాణ యువత తరపున ప్రశ్నిస్తున్నాము. మీ కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా… మీ బిజెపి పార్టీ అధికారం వెలగబెడుతున్న ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా? అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ర్టాల వరుసలో నిలిచింది తెలంగాణ రాష్ర్టం కాదా.. బీజేపీ పాలిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో.. ఉపాధిలేక లక్షల మంది యువత బతుకుతెరువు కోసం తెలంగాణ కు వలస వస్తున్నది నిజం కాదా? ఇక్కడ పెరిగిన ఉపాది అవకాశాల నేపథ్యంలో తెలంగాణకు వస్తున్న రివర్స్ మైగ్రేషన్ నిజం కాదా… అని కేటీఆర్ ప్రశ్నించారు.