తిరువనంతపురం, సెప్టెంబర్ 26: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిష్పాక్షికత, పనితీరుపై విపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో కేరళ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ) జీజీ థామ్సన్ ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. తాను కేరళ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో బీజేపీ అభ్యర్థిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జ్ఞానేశ్ కుమార్ తనకు సూచించారని థామ్సన్ చెప్పారు.
అప్పట్లో కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా జమ్ము కశ్మీర్ విభాగం బాధ్యతలు చూస్తున్న జ్ఞానేశ్ కుమార్ తనను బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలవాలని, తద్వారా మంత్రి పదవి పొందే అవకాశం ఉంటుందని సూచించారని థామ్సన్ ఒక మలయాళ వార్తా చానల్‌కు తెలిపారు. థామ్సన్ ఆరోపణల నేపథ్యంలో కేరళలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై విమర్శలను తీవ్రతరం చేసింది. అటువంటి పదవిని ఆఫర్ చేయడానికి జ్ఞానేశ్ కుమార్ ఎవరని, ఎవరి అదేశంతో ఆయన అటువంటి సూచన చేశారని ఎక్స్ వేదికగా కేరళ కాంగ్రెస్ ప్రశ్నించింది. వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ రాజకీయ అండదండలు లేకుండా ఎన్నికల కమిషన్ ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడిందని భావించలేమని ఆమె పేర్కొన్నారు.