వాషింగ్టన్, సెప్టెంబర్ 26: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతమవుతున్న క్రమంలో దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఏఐ కనుక తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా మారవచ్చంటే, అది 100 కోట్ల ప్రజల మరణాలకు కూడా దారితీయవచ్చునని ఆయన హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏఐ టూల్స్‌ను ప్రజలు దురుద్దేశాలకు వినియోగిస్తే అది ఇప్పటివరకు భూమిపై ఉపయోగించిన అన్ని ఆయుధాల కన్నా అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్నారు. దాని వల్ల వచ్చే ముప్పును తీవ్రంగా పరిగణించాలని అన్నారు.
ఏఐపై చట్టం చేయాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. కేవలం కంపెనీల నియంత్రణ ఒక్కటే సరిపోదని, దానిపై ప్రభుత్వ పర్యవేక్షణ, నిబంధనలు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. కాగా, ఒక ఏఐ మాడల్ తొలిసారిగా ఒక ప్రభుత్వ పోర్టల్‌ను హ్యాక్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ఈ మోడల్ దేశ ఆరోగ్య సమాచార వ్యవస్థలోకి చొరబడి దేశంలోని పౌరుల ఆరోగ్య డాటా, ప్రభుత్వం ఆరోగ్య రంగంపై అందజేస్తున్న సబ్సిడీ తదితర వివరాలను సేకరించింది. కాగా ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ ప్రభుత్వానికి 54 రోజుల తర్వాత తెలిపింది. దీంతో ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్‌తో ఫోన్లో మాట్లాడిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏఐపై నియంత్రణ తప్పనిసరని ఈ సందర్భంగా అల్ట్మన్ ఆయనతో పేర్కొన్నారు.