2012 నుంచి ‘గుజరాత్ మాడల్’ కోసం పెద్ద కార్పొరేట్లు చేస్తున్న దూకుడు ప్రచారం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. కార్పొరేట్లు వ్యవసాయ భూములు, అడవులు, నీటి వనరులు, ఖనిజాలు, గ్రామీణ మార్కెట్లను స్వాధీనం చేసుకుంటూ రైతులు, ఆదివాసుల జీవనోపాధులను మింగేస్తున్నారు. కార్పొరేట్ లాభాలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, పేదరికం, పోషకాహార లోపం, వంచన, ఉపాధి లేమి, బలవంతపు వలసలు, అప్పుల భారం అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం సంక్షేమ బాధ్యతల ఉపసంహరణ జీవన పరిస్థితులను మరింత దిగజారుస్తున్నది.
బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్లకు అపరిమిత అవకాశాలను కల్పించడం, గోదీ మీడియా మద్దతు, యువత, మహిళలు, రైతులకు ఇచ్చే తప్పుడు హామీలపైనే ప్రభుత్వ ‘విజయం’ ఆధారపడి ఉన్నది. ఎన్నికల ప్రజాదరణ తగ్గుతున్న కొద్దీ, ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వాన్ని ‘ఓటుతో తొలగించే’ ప్రజల హక్కును నిరాకరించేందుకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను అమలు చేయాలని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ-జీరామ్-జీని తీసుకువస్తుండగా, చట్టబద్ధమైన ‘పని హక్కు’ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన 125 రోజుల పని కల్పిస్తామనే కేంద్ర హామీని ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయ సీజన్లో ఎలాంటి పని కేటాయించబడనందున పెద్ద భూస్వాములకు చౌకైన కూలీలు లభిస్తారు. పేదలకు వెలుగును అందించాల్సిన విద్యుత్తును అధిక ధరలకు ముందుగానే చెల్లించాల్సిన విధంగా మార్చుతున్నారు. ప్రగతిశీల భూ సంస్కరణలను విస్మరించారు. బంధోపాధ్యాయ్ కమిషన్ బీహార్‌లో పంపిణీ చేయడానికి 20 లక్షల ఎకరాల మిగులు భూమిని గుర్తించింది. కానీ ఇప్పుడు కార్పొరేట్ల కోసం గ్రామ సభ భూములను పూల్ చేయడం కొత్త దిశగా మారింది.
పాలకులు ఇండ్ల స్థలాలను ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ రాజ్యాంగబద్ధమైన ‘నివాస హక్కు’ను ఉల్లంఘిస్తున్నారు. ఆక్రమణదారుల పేరిట పేదల ఇండ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా అటవీ సంరక్షణను పునర్నిర్వహిస్తున్నారు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలోనే ఉన్నది. లాభదాయకమైన ధరలకు కనీస మద్దతు ధర గానీ, వ్యవస్థీకృత ప్రభుత్వ కొనుగోలు గానీ జరగడం లేదు. పెరుగుతున్న అప్పుల భారం రైతుల ఆత్మహత్యలకు కారణమవుతూనే ఉన్నది. ఆదాయాలు తగ్గిపోవడం వల్ల వలసలు పెరుగుతున్నాయి. దళితులు, ఆదివాసులు, మహిళలు, వృద్ధులు అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్న వారిలో ఉన్నారు. దేశంలోని 69 శాతం గ్రామీణ జనాభా ప్రయోజనం కోసం లాభదాయకమైన వ్యవసాయ ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తే, దాని ఆర్థిక వ్యవస్థ తనను తాను నిలబెట్టుకుని అభివృద్ధి చెందగలదు. బలమైన దేశీయ మార్కెట్లు ఉపాధిని సృష్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఈ నేపథ్యంలో అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఈ నెల 28 నుంచి 30 వరకు ఖమ్మంలో నిర్వహిస్తున్న 4వ జాతీయ మహాసభకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మహాసభ దేశంలో రైతాంగ పోరాటాల భవిష్యత్తు పంథాపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన అనుభవంతో భూమి, అడవులు, నదులను కాపాడే దిశగా పోరాటాలకు మహాసభ పిలుపునివ్వనున్నది.
– వి.వెంకట్రామయ్య, అఖిల భారత అధ్యక్షుడు
– డా.ఆశిష్ మిట్టల్, అఖిల భారత ప్రధాన కార్యదర్శి అఖిల భారత రైతు కూలీ సంఘం కేంద్ర కార్యనిర్వాహకవర్గం