నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవాహిని. మొక్కవోని సంకల్పబలం.. సాధించిన ఫలం. నదిని రిజర్వాయర్‌గా మలుచుకుని రీడిజైనింగ్ చేసిన చతురత అద్వితీయం. అనితర సాధ్యం. కాళేశ్వరం.. నీటికి నడక నేర్పిన సృజనాత్మకతకు నిలువెత్తు దర్పణం. అనేక విశేషాల కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం అంటూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) ప్రశంసించింది. ఏఎస్సీఈ తరఫున సంస్థ అధ్యక్షురాలు మారియా లేమన్ సోమవారం మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అది అగ్రరాజ్య వేదిక.. అక్కడున్నోళ్లంతా ప్రపంచ దేశాల ప్రతినిధులు.. అప్పుడే కల్వకుంట్ల తారకరామారావు అని పిలిచారు. ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలు ఒక్కొక్కటిగా చెప్తుంటే వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ మహత్తర ప్రాజెక్టు ద్వారా నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరిస్తుంటే ‘మైండ్ బ్లోయింగ్’ అంటూ చప్పట్లతో హోరెత్తించారు. అవును! విశ్వం విన్నది.. కాళేశ్వర ప్రాజెక్టు ఘనతను. ప్రపంచం చూసింది.. కాళేశ్వర ప్రాజెక్టు అద్భుతాలను. అందుకు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ వేదికైంది.
Ktr1
Kaleshwaram Project | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్నది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి అవార్డుతో ఏఎస్సీఈ సత్కరించింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కరువును తరిమేసిన విధానాన్ని, నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరిస్తుంటే వివిధ దేశాల నేతలు అబ్బురపడ్డారు. కాళేశ్వరం ఒక కలికితురాయి అని పొగడ్తలతో ముంచెత్తారు. దాని ఘనతలను మంత్రి కేటీఆర్ చెప్తుంటే చప్పట్లతో హోరెత్తించారు.
Kaleshwaram
ప్రపంచంలోనే అతి పురాతనమైన ఏఎస్సీఈ
అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఏఎస్సీఈ) సంస్థ ప్రపంచంలోనే అతి పురాతమైనది. న్యూయార్‌లోని క్రోటన్ అక్విడక్ట్‌లో చీఫ్ ఇంజినీర్ ఆల్ఫ్రెడ్ వీ క్రావెన్ కార్యాలయంలో 12 మంది ప్రముఖ సివిల్ ఇంజినీర్ల నేతృత్వంలో 1852లో ఈ సంస్థ ఏర్పడింది. ప్రస్తుతం 177 దేశాల్లో విస్తరించడంతోపాటు 1,50,000కిపైగా సభ్యులను కలిగి ఉన్నది. సహజ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, పునరుద్ధరిస్తూ, సమాజ ఆర్థిక, సామాజిక ప్రగతి- పర్యావరణ పరిరక్షణ, పెంపునకు ప్రణాళికలను రూపొందించడంతోపాటు నిర్వహణలోనూ ఈ సంస్థ కీలకభూమిక పోషిస్తుంది. సివిల్ ఇంజినీరింగ్ సాంకేతిక, వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన ప్రచురణలను వెలువరించే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ కూడా ఇదే. ఏఎస్సీఈకి అనుబంధంగా 9 ఇన్స్టిట్యూట్స్ ఉండగా, అందులో ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి.
ఇది 1999లో ఏర్పాటైంది. ఇవిగాక ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్, కోస్ట్, ఓషియన్, పోర్ట్స్ రివర్స్ ఇన్స్టిట్యూట్, కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూట్, ఇంజినీరింగ్ మెకానిక్స్ ఇన్స్టిట్యూట్స్, జియో ఇన్స్టిట్యూట్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్, ట్రాన్స్‌పోర్టేషన్, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, యుటిలిటీ ఇంజినీరింగ్ అండ్ సర్వేయింగ్ ఇన్స్టిట్యూట్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్‌ను కలిగి ఉన్నది. పరిశోధన పత్రాల ద్వారా వృత్తిని అభివృద్ధి చేసే సివిల్ ఇంజనీర్లను గుర్తించడంతోపాటు విద్యార్థులు, యువ సభ్యులు, కెరీర్ నిపుణులు, ప్రాజెక్టులు, ప్రచురితమైన పత్రాల రచయితలు, పరిశోధకులు/అధ్యాపకులకు ఏటా 85 విభాగాల్లో అవార్డులు, నగదు పురస్కారాలను ప్రదానం చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ విభాగంలో ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి అవార్డును ఇచ్చింది.
Ktr
సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడం గర్వకారణం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకు ఎక్కింది. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పటికే అంతర్జాతీయ డిస్కవరీ చానళ్లలో ప్రసారమైంది. ఆ డాక్యుమెంటరీని వీక్షించిన ప్రతి ఒక్కరూ ‘హ్యాట్సాఫ్ కేసీఆర్’ అంటూ ప్రశంసలతో జేజేలు పలికారు. డాక్యుమెంటరీ ఆద్యంతం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, సీఎం కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి దర్పణం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి అంచెను, ఎదురైన సవాళ్లను, పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలు, పద్ధతులను కండ్లకు కట్టినట్టు చూపగా యావత్తు ప్రపంచం అబ్బురపడింది. అదీగాక.. ఆ ప్రాజెక్టుపై అనేక రాష్ర్టాల ఇంజినీర్లు అధ్యయనం చేసి.. అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మిషన్ కాకతీయ పథకంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పథకం ద్వారా అందుతున్న ఫలితాలను చూసి యావత్తు దేశం నివ్వెరపోతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికబద్ధ చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు శ్లాఘిస్తున్నారు. నీతిఆయోగ్ సైతం పథకాన్ని ప్రశంసించడంతో పాటు అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. మిషన్ కాకతీయను స్ఫూర్తిని తీసుకుని మహారాష్ట్ర సర్కార్ జల్ యుక్త్ శివార్ పేరిట చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. దేశంలోని అనేక ఇతర రాష్ర్టాలు ఈ పథకంపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ విద్యాసంస్థలైన అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ విద్యార్థులు, శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు అధ్యయనం చేసి దీని విశిష్టతలను ప్రపంచానికి చాటారు. పథకం భేష్ అని కితాబిచ్చారు.
ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత
మిషన్ కాకతీయ పథకం వల్ల స్వీడన్లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి నీటి వారోత్సవాల్లో ప్రసంగించే అరుదైన ఘనతను తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకున్నది. 30 ఏండ్లుగా నదుల పునరుజ్జీవం కోసం అవిరళ కృషి చేస్తూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన, రామన్మెగాసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్.. మిషన్ కాకతీయను ప్రశంసించడమే కాదు, తెలంగాణ కృషిని దేశానికి చాటుతానని సంకల్పించుకున్నారు. ఈ పథకం స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) సంస్థల నుంచి జాతీయస్థాయి అవార్డులను సైతం దక్కించుకున్నది. నీటి వనరుల సంరక్షణ, చెరువుల పరిరక్షణ అంశంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ నల్- హర్ ఘర్ జల్ పథకాన్ని చేపట్టింది.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించటం, అవార్డును అందుకోవటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రసంగంతోపాటు, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శించిన డాక్యుమెంటరీని వీక్షించిన ప్రతిఒక్కరు ‘అపర భగీరథుడు కేసీఆర్’ అంటూ కొనియాడుతున్నారు. ‘జై కేసీఆర్’ ‘గ్రేట్ కేసీఆర్’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
వాషింగ్టన్ వీధుల్లో..
Ktr3
మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తున్నది. చలువ అద్దాలు ధరించి మన దేశ ప్రతినిధులతో కలిసి వెళ్తున్న దృశ్యం విశేషంగా ఆకర్షిస్తున్నది. సోమవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఫొటో తీశారు. దానిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘వాషింగ్టన్ వీధిలో’.. అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు నెటిజన్లు భారీగా స్పందించారు. రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న ‘తెలంగాణ సీఈవో’.. ‘గ్లోబల్ లీడర్ ఫ్రం అవర్ ల్యాండ్’ అంటూ కొనియాడారు. ఈ ఫొటోను సాయంత్రంకల్లా దాదాపు రెండున్నర లక్షలమంది వీక్షించగా, సుమారు 9000 మందికి పైగా లైక్ చేయడం విశేషం.