Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అధిక వర్షపాతం, వరదలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై అసెంబ్లీలో శుక్రవారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. వరద నష్టంపై పూర్తి అంచనాలను రూపొందిస్తున్నామని ప్రభు త్వం పదేపదే చెప్తున్నా అవేవీ పట్టించుకోకుండా ఇచ్చిన నిధులు సరిపోవంటూ శ్రీధర్‌బాబు అదేపనిగా ఆరోపణలు చేస్తుండగా, మంత్రి కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. దుద్దిళ్ల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఊహించనిరీతిలో వరదలు సంభవించాయని, అయినా ప్రభుత్వం అన్నివిధాలుగా బాధితులకు అండగా ఉన్నదని వెల్లడించారు. అధికారులు పూర్తిస్థాయిలో అంచనాలను రూపొందిస్తున్నారని, కానీ కాంగ్రెస్ గాలి మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించాలని యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని చురకలంటించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని తెలిపారు. ముఖ్యమంత్రి రైతు రుణమాఫీని ప్రకటించగానే కాంగ్రెస్ ఫ్యూజులు ఎగిరిపోయాయని, ఏం చేయాలో అర్థంగాక ప్రభుత్వంపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మీ అధ్యక్షుడి మాటలను ఒప్పుకుంటారా?
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారని, రైతుబాంధవుడు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ఉదహరించారు. ప్రస్తుతం వరదలతో నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటుందని వెల్లడించారు. రైతుల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, విత్తనాలు అందక, కరెంటు అందక రైతులు నరకం చూశారని నిప్పులు చెరిగారు. ఇక నాడు చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచితాలు వద్దు అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రైతులకు 3 గంటల కరెంటు ఇస్తే చాలు అంటున్నారని ఆ మాటలను ఒప్పుకుంటారా? లేదంటే రైతులకు క్షమాపణ చెప్తారా? అని శ్రీధర్‌బాబును నిలదీశారు. ఇకనైనా ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని చురకలంటించారు.
వీడియో వేస్తామంటే తోక ముడిచిన కాంగ్రెస్
మూడు గంటల విద్యుత్తు చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు వాఖ్యానించారని కేటీఆర్ అనగానే సభ్యులు ‘మూడు గంటల కాంగ్రెస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేచి తమ పార్టీ అధ్యక్షుడు అలా అనలేదంటూ ముక్తాయించారు. దీంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఒక్కసారిగా భగ్గుమన్నారు. తెలంగాణలో చిన్నసన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదని, ఎకరానికి నీరు పారించడానికి ఒక గంట చాలని, మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ అమెరికాలో వ్యాఖ్యానించారని, అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని, అనుమతిస్తే సభలో ప్రదర్శిస్తామని సవాల్ విసిరారు. వీడియో ప్రదర్శనకు అనుమతివ్వాలని స్పీకర్‌ను కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తోకముడిచారు. మంత్రి వేముల సవాల్‌ను పక్కన పెట్టి వరదపై చర్చను కొనసాగించారు. చివరగా నేతలు తోకముడిచారు. అయితే ఆఖరులో కరెంటుపై ప్రత్యేక చర్చ పెడితే దానిపై చర్చిస్తామటూ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క బదులిస్తూ చర్చను అక్కడితో వదిలిపెట్టడం కొసమెరుపు.
ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు: గండ్ర
జీరో అవర్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల వరదల సందర్భంగా తన నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సభకు వివరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమర్థవంతంగా వరద సహాయక చర్యలు చేపట్టిందని వివరించారు. వరదలోనూ క్షేత్రస్థాయిలో ఉండి సేవలను అందించారని కొనియాడారు. బాధితులకు చేపట్టిన పునరావాస చర్యలను వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని మండిపడ్డారు.
కరెంటు వద్దు.. ధరణి వద్దు.. చెక్‌డ్యామ్‌లు వద్దు
కరెంటు విషయం సద్దుమణిగిన అనంతరం శ్రీధర్‌బాబు చర్చను కొనసాగిస్తూ ప్రభుత్వంపై మళ్లీ ఆరోపణలు చేశారు. చెక్‌డ్యామ్‌లు శాస్త్రీయంగా లేవంటూ వ్యాఖ్యానించగా ఈసారి మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకున్నారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ 24 గంటల ఉచిత విద్యుత్తు వద్దు అంటారు. మరొక కాంగ్రెస్ నేత ధరణి వద్దు అంటారు. ఇప్పుడు శ్రీధర్‌బాబు చెక్‌డ్యామ్‌లు వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ విధానం’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. చెక్‌డ్యామ్‌లు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, కాంగ్రెస్ వద్దని అంటున్నదని, రైతులకు ఏది కావాలో అది కాంగ్రెస్ ఎప్పుడూ చేయదని, చెక్‌డ్యామ్‌లు కూడా వద్దు అంటారని ఊహించలేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎస్ఎన్డీపీతో జీహెచ్ఎంసీ వరదలు లేవు: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
2020లో సంభవించిన వరదలతో పోల్చితే ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్‌లో అతితక్కువగా వరదలు సంభవించాయని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివరించారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చేపట్టిన వ్యూహాత్మక నాలా డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఎన్డీపీ) వల్లే అది సాధ్యమైందని కొనియాడారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ఉన్నదని తెలిపారు. ఆయా చోట్ల కూడా దానిని అమలు చేయాలని కోరారు.
పాతబస్తీలో 1,404 కోట్లతో విద్యుత్తు పనులు
హైదరాబాద్ పాతబస్తీలో రూ.1,404.58 కోట్లతో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు నిర్మాణాలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రూ.1,330.94 కోట్ల పనులు పూర్తి కాగా, మరో రూ.73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శాసనమండలిలో ఎంఐఎం సభ్యులు మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రూ.1,404.58 కోట్లలో ట్రాన్స్మిషన్కు ట్రాన్స్‌కో నుంచి రూ.957.29 కోట్లు వెచ్చించగా, ఎస్పీడీసీఎల్ రూ.447.29 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. నాలుగు 220 కేవీ సబ్స్టేషన్లు, రెండు 132 కేవీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు, 15,256 కిలోమీటర్ల 33 కేవీలైన్తోపాటు 63 ఆదనవు ట్రాన్స్ ఫార్మర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. 16 ట్రాన్స్ఫార్మర్స్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 565 కిలోమీటర్ల 11 కేవీ లైన్‌ను వేసినట్టు తెలిపారు. 3,461అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి.. 210 డీఆర్సీ సామర్థ్యాన్ని పెంచామన్నారు. 1,700 లోటెన్షన్ లైన్ వేయడంతోపాటు 540 కిలోమీటర్ల ఎల్టీ రీకండక్టరింగ్ చేశామని వెల్లడించారు. విపత్తు సమయంలోనూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చేసిన ఘనత విద్యుత్తు సంస్థల యజమాన్యాలది.. అందులో పని చేసే సిబ్బందిదని కొనియాడారు. వర్షాలను ఖాతరు చెయ్యకుండా నీటిలో ఈదుకుంటూ పోయి పవర్ కట్ లేకుండా చేశారని గుర్తుచేశారు.
గిరిజన విద్యాలయాల్లో 623 నర్సు పోస్టులు
తెలంగాణ గురుకులాలు దేశానికి తలమానికంగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శాసనమండలిలో సభ్యుడు ఏవీఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 623 గిరిజన విద్యాసంస్థల్లో 1.18 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యస్తున్నారని చెప్పారు. వీరి ఆరోగ్య పర్యవేక్షణ కోసం 623 ఏఎన్ఎం పోస్టులను అవుట్సోర్సింగ్ కింద మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను కూడా 25 శాతం పెంచిందని తెలిపారు. విద్యాసంస్థల్లో గతంలో 1804 సీఆర్టీ ఉపాధ్యాయులు ఉండగా, అదనంగా మరో 299 మంది సీఆర్టీలను నియమించడంతోపాటు వారికి కేవలం10 నెలలు మాత్రమే వచ్చే జీతాలను 12 నెలలకు పెంచి అందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 291 గురుకులు ఉండగా.. వాటిల్లో కేవలం 1.54 లక్షల మంది చదివేవారని తెలిపారు. స్వరాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేసుకొని, 6,10,810 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అన్నింటినీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నట్టు చెప్పారు. గిరిజన గురుకులాలు గతంలో 91 మాత్రమే ఉంటే, మరో 97 ఏర్పాటు చేసుకొన్నామని చెప్పారు
ప్రత్యేక పంటల బీమా తెస్తాం
కేంద్ర ప్రభుత్వ ఫసల్‌బీమా పథకం విఫలమైందని, రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పంటల బీమా పథకాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇప్పటికే రూ.151 కోట్లు అందజేశామని, మరో రూ.160 కోట్లు త్వరలోనే అందజేస్తామని తెలిపారు. ఫసల్‌బీమాను రాష్ట్రంలో నాలుగేండ్లపాటు అమలు చేశామని, ప్రభుత్వం బీమా సంస్థలకు ప్రీమియం కింద రూ.2,415 కోట్లు చెల్లించగా, రైతులకు నష్టపరిహారం కింద రూ.1,893 కోట్లు మాత్రమే వచ్చిందని వివరించారు. దీంతో రూ.500 కోట్ల మేర రైతులు నష్టపోయారని చెప్పారు. పంటల మార్పిడి, ఆయిల్‌పాం సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, మార్కెట్లో నూనెగింజలు, పప్పుధాన్యాలకు డిమాండ్ ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 2014-15కు ముందు ఏడాదిలో 131.24 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2022-23 నాటికి 238 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు.
గురుకులాలకు 13,500 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, విద్యార్థుల కోసం ఎనిమిదేండ్లలో రూ.13,500 కోట్లు వెచ్చించిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రసమయి, అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో 6.10 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారని చెప్పారు. గురుకులాల్లో సీట్ల సంఖ్య పెంచాలన్న సభ్యుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. మైనార్టీలకు కూడా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ కోరడంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సానుకూల నిర్ణయం చెప్తామని అన్నారు.
ఆసరా కోసం ఏటా 11,774.90 కోట్లు
సామాజిక భద్రతతో జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్ పథకాన్ని అమలుచేస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలో వివిధ క్యాటగిరీలకు చెందిన 43,68,784 మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తున్నట్టు చెప్పారు. 2013-14లో రూ.809.64 కోట్లుగా ఉన్న పింఛన్ల వ్యయం, 2023-24లో రూ.11,774.90 కోట్లకు పెరిగిందన్నారు. మండలిలో సభ్యులు విఠల్ దండే, తక్కళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పల్లెప్రగతి కింద 12,769 పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామాలు, నర్సరీలు, రోడ్లు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయన్నారు.
రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలి
మెదక్ నియోజకవర్గంలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఎమ్మెల్యే పద్మారెడ్డి, మంచిర్యాలకు వరద ముంపు లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదివాసీ ఏరియాల్లోని వాగులపై హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆత్రం సక్కు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 22 పనులు వేగవంతం చేయాలని గంప గోవర్ధన్, భద్రాచలంలో వరద నివారణకు కరకట్టలు నిర్మించాలని పొదెం వీరయ్య కోరారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సంబంధిత మంత్రులు సభకు వెల్లడించారు.
రాష్ట్రంలో విప్లవాత్మక ఫలితాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో విప్లవాత్మక ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దేశ చరిత్రలోనే గొప్ప విషయమని కొనియాడారు.
హరీశ్‌రావు మంత్రి కాదు..డాక్టర్
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలను మార్చడంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు విజయవంతమయ్యారని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. గతంలో కంటే ప్రభుత్వ దవాఖానల, వైద్యుల పనితీరు చాలా మెరుగైందని చెప్పారు. హరీశ్‌రావును మంత్రిగా కాకుండా డాక్టర్ హరీశ్రావుగా పిలవడం సమంజసమని అన్నారు.
ఆత్మగౌరవానికి ప్రతీక వరంగల్ దవాఖాన
తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్యారోగ్య రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానలు, వైద్యం ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వరంగల్‌లో సెంట్రల్ జైలును తొలగించి 26 అంతస్తులతో నిర్మిస్తున్న దవాఖాన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.