KTR | హైదరాబాద్ : ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత..? చెప్పే దమ్ముందా..? అని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
గత పదేండ్లలో ప్రభుత్వ రంగంలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. మా కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా..? ఉంటే తెలంగాణ పిల్లలకు చెప్పండి. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదు. ఈ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండి. గుజరాత్లో 6 కోట్ల జనాభా ఉంది. రాజస్థాన్లో ఎనిమిదిన్నర కోట్లు, కానీ ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదు. మనం 4 కోట్ల జనాభాకు 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. వాళ్లొచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇవి వాస్తవాలు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశాం. వాస్తవాలు ఇవి. కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా..? ప్రయివేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.