ముప్కాల్, మార్చి 4: నిరుపేద విద్యార్థిని వైద్యా నికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లికి చెందిన ముత్యాల బాలరాజు-ప్రమీల దంపతుల కూతురు హంసిని (12) గుండె వ్యాధితో బాధపడుతున్నది. ఆమెకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని, సుమారు రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. బాలరాజు దంపతులు స్థానిక నాయకుల సహకారంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి.. బాలిక వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తామని మాటిచ్చారు. తక్షణ సాయంగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.6 లక్షలు అందించినట్టు బాలిక తండ్రి బాలరాజు తెలిపారు. వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.