KTR | యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా వుందా..? అని ప్రశ్నించారు. ఒక వేళ అలాంటి రాష్ట్రం ఉంటే సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
1. తొమ్మిదిన్నర ఏండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. 1,60,083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.. ఈ లెక్కతప్పని నిరూపించగలవా..?
2. మీరు అధికారం వెలగబెట్టిన పదేండ్ల కాలంలో(2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 10,116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన మీ ప్రేమ..?
3. మా ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!
4. మీ హయాంలో( 2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది కేవలం 1,012 జాబ్స్..!
5. ఇదీ మీకూ మాకూ వున్న తేడా..! మీరొచ్చి మాకు నీతులు చెబితే ఎట్లా..?
6. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా..? ఉద్యోగం చేశావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..?
7. 95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత మాది..! మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా..?
8. 1972 లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలను సమర్థిస్తూ తీర్పునిస్తే.. పార్లమెంట్లో చట్టం చేసి ముల్కీ రూల్స్‌ను రద్దు చేసి.. తెలంగాణ స్థానికత హక్కులకు సమాధికట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా..?
9. ఆరుసూత్రాలు, 610 జీవోలు, గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి.. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చేసి.. నాన్ లోకల్ కోటా పెట్టి.. తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా..?
10. మీ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక.. ఉద్యోగాల్లేక నిరాశా, నిస్పృహలతో తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి అడవిబాటపట్టి నక్సలైట్లలో చేరింది నిజమా..? కాదా..?
11. వేలమంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి.. ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశమైన పాలన మీది కాదా..?
12. మీ కాలంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా మారి.. అంగట్లో బేరంపెట్టి కొలువులను అమ్ముకోలేదా..? ప్రాంతీయ వివక్షతో..ఇంటర్వ్యూల ముసుగులో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది నిజం కాదా..?
13. 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్.. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన విద్యార్థులపై తూటాలు పేల్చి.. ఏడుగురు తెలంగాణ ముద్దుబిడ్డల్ని చంపిన దుర్మార్గులు.. దోషులు మీరు కాదా..?
14. 1969లో జై తెలంగాణ అని నినదించిన 369 మంది యువకిశోరాల గుండెల్లో తుపాకి గుండ్లు దించి పొట్టనపెట్టుకున్న నర హంతకులు మీరు కాదా..?
15. 2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి.. పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీదికాదా..? సోనియగాంధీ బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా..?
16. కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? 6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్తావా..? వాగ్దానం చేసి యువతను వంచించలేదా…?
17. మీరు రాజ్యం ఏలుతున్న రాజస్థాన్‌లో.. ఛత్తీస్‌గఢ్‌లో.. హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ హామీని మరిచి.. నిరుద్యోగులను నిండా ముంచింది నిజం కాదా..?
18. మీరు ప్రకటించిన పసలేని జాబ్ క్యాలెండర్ ఒక పచ్చి మోసం కాదా..? ఎన్నికల కోడ్ అమల్లో వుండే 2024 మార్చి.. ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ నోటిఫిషన్లు ఎట్లా సాధ్యం..? యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..?