Minister KTR | ‘మేం ఎవరికీ బీ-టీం సీ -టీం కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఆలుమగలని అందరికీ తెలుసు. పార్లమెంట్లో అలుముకున్నదెవరు? కౌగిలించుకున్నదెవరు? కన్నుగీటుకున్నదెవరు? మొహబ్బత్ కా దుకాణ్ పెట్టిందెవరు?’
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్‌ది ఆలుమగల బంధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో శివసేనతో నిన్నటిదాకా సంసారం చేసిన కాంగ్రెస్ పార్టీయా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనేది? అని ఆయన మండిపడ్డారు. ‘మేం బీ టీం, సీ టీం ఏంది? మీరు ఆలుమగలు. పార్లమెంట్లో అలుముకున్నదెవరు? కౌగిలించుకున్నదెవరు? కన్నుగీటుకున్నదెవరు? మొహబ్దత్ కా దుఖాన్ పెట్టిందెవరు?’ అని ప్రశ్నించారు. ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మబోరని అన్నారు.
శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘మహారాష్ట్రలో మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ వైఖరిని ముస్లింలు, క్రిస్టియన్లు అర్థం చేసుకోవటం లేదా? అని ప్రశ్నించారు. మొన్నటి దాకా మేఘాలయలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే ప్రభుత్వంలో కలిసి పనిచేయలేదా? అని నిలదీశారు. కాం గ్రెస్, బీజేపీలు వెయ్యి శాతం భాగస్వాములని స్పష్టంచేశారు. ‘కరీంనగర్, నిజామాబాద్‌లో కాంగ్రెస్ సహాయంతో బీజేపీ గెలిచింది.
జీవన్‌రెడ్డి, అర్వింద్ అలయ్ బలయ్ తీసుకున్నది నిజం కాదా? బీజేపీతో అంటకాగుతున్న కాంగ్రెస్ మమ్మల్ని బీ టీం అనటం ఏమిటి? తమది హిందూత్వ పార్టీ అని శివసేన బాహాటంగా ప్రకటించిందని, అదే ఎంఐఎం అలా ప్రకటించిందా? మాది బీ టీం అయితే ముస్లింలకు 204 పాఠశాలలు పెట్టి.. మైనార్టీలకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయిస్తామా? కాంగ్రెస్‌దే చోర్ టీం. బోఫోర్స్ నుంచి మొదలు పెడితే అన్ని ఫోర్స్‌లు కాంగ్రెస్‌వే. ఏ టు జడ్ కుంభకోణాల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ. రేవంత్‌ను పక్కనపెట్టుకొని రాహుల్‌గాంధీ అవినీతి గురించి మాట్లాటడం విడ్డూరంగా ఉన్నది. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్. ఎమ్మెల్యే సీట్లను అమ్ముకునే కాంగ్రెస్ పార్టీయా మాకు నీతులు చెప్పేది? మేం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టి మ్యానిఫెస్టోలో పెట్టుకొన్నది’ అని ధ్వజమెత్తారు.
విజయం మాదే
అభ్యర్థుల ఖరారులో అందరి కన్నా ముందున్నట్టే ఎన్నికల విజయంలో తామే ముందుంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు. రాష్ర్టానికి నాయకత్వం వహించేది, వహించగలిగేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం మరొకటి లేదని తెలంగాణ ప్రజలకు అచంచల విశ్వాసం ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు గతంలో వచ్చిన 88 సీట్ల కన్నా ఈసారి ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర ఏ పార్టీల్లో టికెట్లు రానివారికోసం కాంగ్రెస్ వెతుకుతున్నదని ఎద్దేవా చేశారు.
ఇక బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని అన్నారు. గతంలో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఈసారి 110 సీట్లలో డిపాజిట్లు కోల్పోవటం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికల క్షేత్రంలో తమతో తలపడేది కాంగ్రెస్సేనని అన్నారు. కాంగ్రెస్‌కు తన చరిత్రే గుదిబండ అని తెలిపారు. 55 ఏండ్ల పాలనలో ఏ రంగంలో తీసుకున్నా కాంగ్రెస్ అట్టర్‌ఫ్లాప్ అని ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ‘2004-2014 దాకా ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా చేసిన ఉద్యోగ నియామకాలు 24, 400. అందులో 42 శాతం తెలంగాణవి అనుకుంటే పదివేల ఉద్యోగాలు.
ఈ లెక్కన కాంగ్రెస్ పదేండ్లకాలంలో చేపట్టినవి ఏడాదికి వెయ్యి మాత్రమే. అదే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 1.30 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. అంటే ఏటా 13 వేల ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం’ అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే రాజకీయ దుగ్ధతో ‘ఆపేది వాళ్లే.. మళ్లీ గొడవ పెట్టేది వాళ్లే’నని నిప్పులు చెరిగారు.
మాఫియాలన్నీ కాంగ్రెస్‌వే
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఉన్నదని రాహుల్‌గాంధీ అనటం ఆయన అజ్ఞానానికి నిదర్శమని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద రాష్ర్టానికి వచ్చిన ఆదాయం రూ.39.40 కోట్లు మాత్రమేం. మా పాలనలో రూ.5,800 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ పాలనలో ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మంతా ఆ పార్టీ నేతల జేబుల్లోకి పోయింది. శాండ్ మాఫియా.. ల్యాండ్ మాఫియా కాంగ్రెస్‌దే. సూట్‌కేసులు మోసే చరిత్ర కాంగ్రెస్‌దే. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు పెడితే, బీఆర్ఎస్ పాలనలో 30 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. విద్య, వైద్యం, సంక్షేమం ఇలా ఏ రంగంలోనూ కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కాదు’ అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు నిజం కాదా?
ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు ఉన్నమాట వాస్తవం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదు గంటల కన్నా ఎక్కువ కరెంట్ ఇవ్వలేమని కర్ణాటక మంత్రి విశ్వనాథగౌడ ప్రకటించింది నిజం కదా? అని నిలదీశారు. ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో పవర్ హాలిడేలు ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కొంతమంది నాయకులు టికెట్ రాక అటుఇటు మారినా ప్రజలు మారబోరని కేటీఆర్ అన్నారు. ఈసారి నాయకులు పోయిన క్రమంలో తమకు ఖమ్మంలో సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తంచేశారు. నాయకులు ఎటు ఉన్నరు అనే దానికన్నా ప్రజలు ఎటు ఉన్నారు అన్నదే తమకు ముఖ్యమని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు.
మోదీ మంచి నటుడు
ప్రధాని నరేంద్రమోదీ మంచి నటుడని, అబద్ధాల స్క్రిప్టు బాగా చెప్తారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండుసార్లు ఇలాంటి స్క్రిప్టుతోనే దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీది ఒడిసిపోయిన కథ అని ఎద్దేవా చేశారు. చూస్తుంటే బండి సంజయ్.. కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు. హిందీ రాదని చెప్పుకున్న బండి సంజయ్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారం చేయడానికి వెళ్లి ఏం చెప్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలుగు కూడా రాదని ఎద్దేవా చేశారు.
వందల మంది పిల్లలను చంపిన బలిదేవత సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపర్చేలా ప్రొఫెసర్ కోదండరాం వెళ్లి రాహుల్‌గాంధీతో అలయ్ బలయ్ తీసుకున్నారని, అది ఆయన విజ్ఞత అని విమర్శించారు. ‘క్రికెట్ వరల్డ్ కప్ నడుస్తున్నది. ఇక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) మొదట ఆడిన తరువాత.. రెండో ఇన్నింగ్స్ దేశ రాజకీయాల్లో ఆడుదాం’ అని చమత్కరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, అది మీడియా సృష్టి మాత్రమేనని తెలిపారు. పథకాల లబ్ధిదారులు మౌనంగా ఉంటారని, ఓ పది మంది గగ్గోలు పెట్టేసరికి వారిదే మెజార్టీ అని మీడియా భావిస్తున్నదని అన్నారు.
ఉద్యోగాల భర్తీలో మనదే అగ్రస్థానం
దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం కేవలం తెలంగాణే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ కొంత ఆలస్యం జరగడం వల్ల 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని కొందరు ఉపన్యాసం ఇస్తున్నారు. గ్రూప్-1 మొదటి సారి పరీక్షకు 3.5 లక్షల మంది, రెండోసారి పరీక్ష పెట్టినప్పుడు 2.3 లక్షల మంది హాజరయ్యారు. గ్రూప్-4 పరీక్షకు కూడా సుమారు 4 లక్షల మంది హాజరైనట్టున్నారు. మొత్తంగా చూసినా 12 నుంచి 13 లక్షలు దాటలేదు. 30 లక్షల మంది అనేది టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన వారి సంఖ్య. టెక్నికల్‌గా వారంతా నిరుద్యోగులు కాదు.
రాష్ట్రం వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసిన పోస్టులు 1.30 లక్షలు. మరో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము. ఇదే దేశంలోనే రికార్డు’ అని తెలిపారు. ప్రవళ్లిక ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తే, తాము ఆమె కుటుంబానికి అండగా నిలబడ్డామని చెప్పారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నది అవాస్తవమని, ముదిరాజ్‌లను రాజ్యసభకు మొదటిసారి తీసుకెళ్లింది కేసీఆరేనని గుర్తుచేశారు. రెండుమూడు రోజుల్లో కొన్ని వార్తలు వింటారని.. వెయిట్ అండ్ సీ అని తెలిపారు. ఈసారి హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పక్కాగా ఓడిపోతారని, గజ్వేల్‌లో బరాబర్ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. తెలంగాణలో తనకంటే తెలివైనవారు.. సమర్థులు చాలా మంది ఉన్నారని, తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని స్పష్టంచేశారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఎక్కడంటే అక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ‘ఆయన కరీంనగర్లో పోటీ చేశారు.. సిద్దిపేటలో చేశారు.. గజ్వేల్‌లో చేశారు.. మహబూబ్‌నగర్‌లో చేశారు.. మెదక్‌లో చేశారు.. ఇప్పుడు కామారెడ్డికి వెళ్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తారు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. కుల గణన చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోనే తీర్మానం చేశామని గుర్తుచేశారు. ఇలా తీర్మానం చేసిన మొదటి పార్టీ తమదేనని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం దాదాపు కొలిక్కి వచ్చిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
‘ప్రధాని మోదీ వచ్చి ఒక గుజరాత్ వ్యక్తి మిమ్మల్ని విడిపించారు.. ఇవ్వాళ ఇంకో గుజరాత్ బిడ్డ వచ్చి కేసీఆర్ పాలన నుంచి స్వాతంత్రం ఇస్తాడు అని మాట్లాడారు. ఇది కచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చటమే. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బీఆర్ఎస్వాళ్లు బిర్లామందిర్ దగ్గర అడ్డుక్కునేవారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రముఖ కవి శ్రీశ్రీ చెప్పినట్టుగా.. బానిసకొక.. బానిసకొక.. బానిస కవిత వీళ్లకు బాగా సరిపోతుంది. ఇక్కడ ఉన్నోడు ఢిల్లీకి బానిస.. వానికి బానిసలు కింద ఉన్నోళ్లు.. వీళ్లకు బీఫాంలు కూడా ఇక్కడ ఇవ్వరు. ఢిల్లీకి వెళ్లి అడుక్కోవాలి.. వీళ్లు తెలంగాణను నడుపుతరట! మేం చూడాలంట!’ అని అంటూ ఘాటుగా స్పందించారు.
వారసుల పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అని తీర్మానించి తీరా ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ఇక్కడ 55 మందికి టిక్కెట్లు ఇస్తే.. అందులో మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య.. జానారెడ్డి కుమారుడికి టికెట్లు ఇచ్చారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఏమైంది? దానినే తుంగలో తొక్కిన కాంగ్రెస్.. వరంగల్ డిక్లరేషన్‌ను, గ్యారెంటీలను గాలికి వదిలేయదని గ్యారెంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.
కేంద్రంలో సంకీర్ణమే
2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి వచ్చి.. జాతీయ పార్టీలే బయటి నుంచి మద్దతిచ్చే పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి నిర్ణయాలు వారివేనని.. అందులో తప్పేమీ లేదని తెలిపారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. రావాల్సిన నిధులు ఆపుతున్నదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ మెడపై కత్తిపెట్టి శత్రువులా చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్పీ సింగ్ అనే కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి రుణాలు ఆపేస్తామని బెదిరించారని, మెడపై తలకాయ ఉన్న మంత్రి ఎవరైనా అలా అంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో రోడ్ షో
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో బహిరంగ సభల కన్నా రోడ్‌షోలకే తాము ప్రాధాన్యమిచ్చామని కేటీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలో తాను గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిర్వహించిన తరహాలోనే నగరంలో రోడ్ షోలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారని, వాటికి విశేష స్పందన ఉన్నదని చెప్పారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సీఎం కేసీఆర్ 95-100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారని తెలిపారు.
మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేసింది?
మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీని బూచిగా చూపించి ఓట్లు వేయించుకోవడం తప్పితే కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. 55 ఏండ్లు ప్రభుత్వాన్ని నడిపి మైనార్టీల పేదరికానికి కారణమైందని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌కో మోఖా దియా గ్యారా బార్.. కాంగ్రెస్‌నే ధోకా దియా గ్యారా బార్’ అని మంత్రి మండిపడ్డారు. రాహుల్‌గాంధీ వాళ్ల నాయనమ్మ నుంచి మొదలుపెట్టి.. ఇప్పటి వరకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మాకంటే బెటర్‌గా మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ ఎక్కడుంది? మాకంటే మైనార్టీ వెల్ఫేర్ ప్రొగ్రామ్స్ ఎక్కడున్నాయి?’ అని ప్రశ్నించారు. పార్టీ మ్యానిఫెస్టోను మరింత విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్‌రూం ఇన్చార్జ్జ్ల మీటింగ్ పెట్టుకున్నామని, వారితో అక్కడి పరిస్థితులను తెలుసుకుని పండుగ తరువాత మ్యానిఫెస్టోను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్తామని తెలిపారు. కొందరు ఉద్యమకారులే బయటకు వెళ్లారని.. వారందరూ తిరిగి పార్టీలోకి వస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
నోట్ దిస్ పాయింట్..
