Minister KTR | బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులో ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగురవేసి.. సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జిలదే అని మంత్రి కేటీఆర్ మరోసారి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి.. పలు అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుపుతామని వెల్లడించారు. 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలపై సావధానంగా చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు.
‘ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించాం. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేశాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చినచిన్న ఇబ్బందులను కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తాం. ‘ అని తెలిపారు.