హైదరాబాద్ : 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకురాలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాక వాళ్ల ఊరుకు కరెంటు వచ్చిందని, 2022 వరకు కూడా కరెంట్, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండడం మన దురదృష్టమన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న 36వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మనకు క్వాలిటీ అనగానే విదేశాలు గుర్తుకు వస్తాయన్నారు. భారత్ అంటేనే శక్తివంతమైన దేశమని, 1986లో చైనా, భారత్ రెండు దేశాల జీడీపీ ఒకేరంగా ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు 5.7శాతం ఎక్కువ వృద్ధి రేటు సాధించిందన్నారు. చైనా అంత వృద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్లతో ముందుకెళ్తోందన్నారు.
అద్భుతమైన క్వాలిటీ మనదగ్గర ఉందని, క్వాలిటీ తక్కువగా ఉన్న చైనా ముందుకెళ్తోందని.. కానీ, క్వాలిటీ ఉన్న మనం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కుల, మతాలు చూస్తూ వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే మాటలతో నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ రాక ముందు పరిశ్రమ రంగం, తెలంగాణ వచ్చాక, కేటీఆర్ పరిశ్రమల మంత్రి అయ్యాక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు అన్నారు.
కరెంట్ లేక పవర్ హాలీడేలు ఉండేవని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కుదేలైందన్నారు. టీఎస్ ఐ పాస్‌తో పరిశ్రమల అనుమతులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 24 గంటల కరెంటుతో పారిశ్రామిక రంగం ముందుకెళ్తుందని తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని, కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్లు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. టీ హబ్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలిచిందని, టీ వర్క్స్ అనే సంస్కరణ గొప్పగా సాగుతోందన్నారు.