జగిత్యాల : మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రధాన్యం ఇస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నూతన సఖి భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్త్రీ రక్షణ కోసం ప్రభుత్వం మహిళా హెల్ప్ లైన్ 181 ను ప్రారంభించిందని, మహిళల అక్రమ రవాణాను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గృహ హింస, భౌతికంగా, మానసికంగా కుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో బతుకు భారంగా వెళ్లదీస్తున్న మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి సఖి కేంద్రం పని చేస్తాయని పేర్కొన్నారు. మహిళల రక్షణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకారమందించాలని మంత్రి కోరారు.
సఖీ కేంద్రం వద్ద మంత్రి, తదితరులు
మహిళలు వేదనతో సఖి కేంద్రానికి వస్తారని వారి సమస్యలకు వీలైనంతవరకు సత్వర పరిష్కారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేష్, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ,అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పాల్గొన్నారు.