హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్ భారీ కుట్రకు పన్నాగం పన్నాడా? అక్టోబర్ 10 నుంచి 15వ తేదీలల్లో ఎప్పుడైనా కాళ్లకు, చేతులకు పట్టీలు చుట్టుకొని ప్రచారం చేస్తాడా? అవసరమైతే తన అనుచరులతోనే దాడి చేయించుకొని.. అంతా టీఆర్ఎస్ మీదే వేయాలని చూస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దుబ్బాకలో రక్తికట్టిన రఘునందన్‌రావు సీన్‌ను హుజూరాబాద్‌లోనూ అమలు చేసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో తన అనుచరులతోనే దాడి డ్రామా ఆడేందుకు వ్యూహాలు పన్నిన్నట్లు తమకు సమాచారం అందిందని కుండబద్ధలు కొట్టారు మంత్రి ఈశ్వర్. కమలాపూర్ మండలంలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దాడి షోను వాడుకొని, ప్రజల్లో సింపతీ పెంచుకొని, ఓట్లు రాబట్టాలని నీతిమాలిన, దుర్మార్గమైన చర్యలకు పూనుకున్నట్లు చెబుతున్నారు మంత్రి ఈశ్వర్. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ ఇటువంటి స్టంట్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు. ఎక్కడో సరిహద్దు గొడవలను తీసుకొచ్చిన మన హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తారని మండిపడ్డారు. బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, ఇకనైనా కుట్రలు, కుయుక్తులు మానుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల కుతంత్రాలను పసిగట్టి బుద్ధి చెప్పాలని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.