హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమశాఖ అధికారుల పని తీరుపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వస్తున్నారే తప్ప ప్రభుత్వ నిర్దేశిత గడువులో పనులు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ భవనంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి కొప్పుల శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంక్షేమశాఖ చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప మధ్యలో పనులు నిలిపి వేయడమేమిటని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషిచేయాలి తప్ప, బాధ్యత లేకుండా వ్యవహరించవద్దని హితవు పలికారు. ప్రభుత్వం చేపట్టిన పనులు పెండింగ్‌లో ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి అవి పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా ఆ దిశగా కృషి చేయాలని చెప్పారు. చిన్న పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు దొరకని పక్షంలో స్థానిక సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక నేతల సాయంతో పూర్తి చేయించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై కూడా సమీక్షించిన మంత్రి.. నెలలో ఒకట్రెండు సార్లు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జ, అడిషనల్ కమిషనర్ ఉమాదేవి, స్పెషల్ సెక్రటరీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.