ధర్మపురి : ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు సిలిండర్ ధర పెరగ్గా.. నిరసనగా కట్టెల పొయ్యిపైన వంటావార్పు చేసి, అనంతరం వారానికి ఒకసారి పెట్రోల్ డీజిల్ ధర పెరగడంతో ఎడ్లబండికి ఆటో లాగి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వంట గ్యాస్ రూ.వెయ్యి చేశారని.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచేశారంటూ కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెట్రో ధరలు పెరగడంతో ఇతర నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కూడా రెక్కలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని కోరారు.