Minister Koppula | వెల్గటూర్ : కాంగ్రెస్ పార్టీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మూడు గంటల కరెంట్ చాలనే రేవంత్ రెడ్డి ముక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆరాటపడుతున్నాడని.. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాము అభివృద్ధి కోసం పోరాడుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, పడకల్, కొత్తపేటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రజా ఆశీర్వదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో అవకాశం ఇవ్వాలని వస్తున్నారని అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇస్తే రాష్ట్రం మరో 50 ఏండ్లు వెనక్కిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి అంటే కేరాఫ్ తెలంగాణ అని చెప్పుకునేవిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తయారు చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కండ్లు లేని కాంగ్రెస్, సోయి లేని బీజీపీ నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబడట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. బీజేపీకి క్యాడర్, పోటీ చేసే క్యాండిడేట్స్ లేరని ఎద్దేవా చేశారు. అన్ని వేళల అందుబాటులో ఉంటూ.. కుటుంబసభ్యుడిగా మెదిలే తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు.