గీసుగొండ, ఫిబ్రవరి 20: మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మధ్య వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ సంస్థ జిల్లాస్థాయి శిక్షణా సమావేశం గురువారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలలో నిర్వహించేందుకు ఆర్జీపీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షుడు కునాల్ బెనర్జీ, రాష్ర్టాల ప్రతినిధులు వచ్చారు.
సమావేశం నిర్వహణకు కొద్ది నిమిషాల ముందు పోలీసులు వచ్చి అనుమతి లేదం టూ ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి. జిల్లాస్థాయి సమావేశానికి కాంగ్రెస్నాయకు లు, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి హుకుంజారీ చేయడంతో పాటు ఎవరైనా సమావేశానికి వెళితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నట్టు ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు భరత్ ఆరోపించారు.