హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఇతర అటవీశాఖ అధికారులు సునీతభగవత్, రామలింగం, ప్రియాంకవర్గీస్, బీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అడవుల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడొద్దని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ హరిత నిధి’ అంశంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో ఫైర్స్ తగ్గించేందుకు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని దిశా నిర్దేశం చేశారు.
ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకు సంబంధించి అటవీ, టూరిజం, పరిశ్రమలశాఖల అధికారులతో ఒక సంయుక్త సమావేశం కోసం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అభిప్రాయపడ్డారు. సమావేశంలో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్నదీమ్, పీసీసీఎఫ్ సువర్ణ, సీసీఎఫ్ రామలింగం, సునీతభగవత్, భీమానాయక్, ప్రియాంకవర్గీస్, డీఎఫ్వోలు పాల్గొన్నారు.