హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అడవుల ఆక్రమణను అరికడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయమైన అరణ్య భవన్లో సోమవారం ఆమె అధ్యక్షతన జరిగిన ఆ శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, అదే సమయంలో చట్ట వ్యతిరేకంగా అడవుల ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గొత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రై సిటీస్‌గా ఖ్యాతిగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో పచ్చదనం పెంపు, పారుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి కూడా సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ ఎంసీ పర్గెయిన్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, జిల్లాల కన్జర్వేటర్లు పాల్గొన్నారు.