Minister Konda Surekha | వరంగల్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద చర్యలతో వార్తల్లోకెక్కారు. మొన్నటికి మొన్న సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్య లు చేసి వివాదానికి కారణమైన ఆమె, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే కయ్యానికి దిగారు. పక్క నియోజకవర్గంలోని పోలీస్‌స్టేషన్‌కు ఆటోలో వెళ్లి కాంగ్రెస్సోళ్లపైనే కేసులు పెట్టాలని పట్టుబట్టారు. ఏకంగా ఇన్స్పెక్టర్ కుర్చీలోనే కూర్చొని హల్చల్ చేశారు. తన మాట వినని ఇన్ స్పెక్టర్, ఏసీసీ, డీసీపీలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దసరా ఫ్లెక్సీలతో రగిలిన ఫొటోల వివాదంలో ఆమె జోక్యం చేసుకొని రచ్చకెక్కడాన్ని కాంగ్రెస్ వర్గాలే తప్పుపడుతున్నాయి.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి కొండా సురేఖకు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి, మంత్రి సురేఖకు మధ్య ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పరకాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం మంత్రి సురేఖ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే రేవూరి స్వయంగా ఆమెతోనే ఫోన్లో వాగ్వాదానికి దిగారు. అప్పటి నుంచి వీరిద్దరి గ్రూపు రాజకీయాలు కార్యకర్తల గొడవల దాకా వెళ్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం ధర్మారంలో శనివారం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వర్గీయులుగా ఉన్న బండి రాజ్‌కుమార్, ముస్కు సురేశ్, కూస రాజుకుమార్, చౌడు శివప్రసాద్, ముస్కు రాజుకుమార్, చుంచు రాజు, మహేశ్వర్, వంశీ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఎందుకు పెట్టలేదని గ్రామానికి చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు పిట్టల అనిల్, పిట్టల భాను గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఉత్సవాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. స్థానికులు కల్పించుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. కొద్ది సేపటి తర్వాత మంత్రి సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే రేవూరి వర్గీయులు చింపివేశారు. దీంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. దాడిలో ఎమ్మెల్యే రేవూరి వర్గీయులు పిట్టల అనిల్, భాను గాయపడ్డారు. వీరిలో పిట్టల అనిల్‌ను ఎమ్మెల్యే రేవూరి ఆదివారం పరామర్శించారు.
ధర్మారంలో ఎలాంటి గొడవలు కాకుండా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి వర్గీయులు ఎనిమిది మందిపై గీసుగొండ పోలీస్‌స్టేషన్‌లో పిట్టల అనిల్, పిట్టల భాను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రి అనుచురులైన బండి రాజుకుమార్, ముస్కు సురేశ్, కూస రాజ్‌కుమార్, చౌడ శివప్రసాద్. ముస్కు రాజ్‌కుమార్, చుంచు రాజును పోలీసులు గీసుగొండ పోలీస్‌స్టేషన్‌ను తీసుకువచ్చి కొట్టారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముగ్గురు భవానీ మాలలు ధరించి ఉన్నారని, వారిని వదిలపెట్టాలని మంత్రి సురేఖ అనుచరుడైన మాజీ రౌడీ షీటర్ గోపాల నవీన్ రాజు పోలీసులను డిమాండ్ చేశాడు. పోలీసులు వదిలి పెట్టకపోవడంతో మంత్రి సురేఖ డీసీపీ, ఏసీపీలకు ఫోన్‌చేసి వారిని వదిలిపెట్టాలని ఆదేశించారు. పోలీసులు వారిని వదిలిపెట్టడం లేదని అహనంతో ధర్మారంలో ధర్నా చేయాలని తన అనుచరులను పురమాయించారు. మంత్రి సురేఖ ఆదేశాల మేరకు ఆమె అనుచరులు ధర్మారంలో వరంగల్-నర్సంపేట రహదారిపై ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
పోలీసులు మాట వినడం లేదని అసహనంతో మంత్రి కొండా సురేఖ గీసుగొండకు బయల్దేరారు. మంత్రి అనుచరుల ధర్నా కారణంగా ధర్మారంలో ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి కాన్వాయ్‌లోని కారు దిగి ధర్నా అటువైపునకు వెళ్లి ఆటోలో ఠాణాకు వెళ్లారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘మా వాళ్లను ఎందుకు అరెస్టు చేశారు. ఎందుకు కొట్టారు. వాళ్లు ఏమైనా దేశ ద్రోహులా? కాంగ్రెస్ నాయకులను కొడతారా? వీరంతా పని చేయడం వల్లే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాలలో ఎమ్మెల్యేగా గెలిచాడు. గాయపడిన పిట్టల అనిల్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకురావాలి’ అని పోలీసు అధికారులను డిమాండ్ చేసి అక్కడే ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుకున్నారు.
మంత్రి సురేఖ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అక్కడికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్‌తో మంత్రి సురేఖ వాగ్వాదానికి దిగారు. తమ వారిపై దాడి చేసిన డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ మహేందర్‌ను బదిలీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంటానని పట్టుబట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ చెప్పినా అరగంట సేపు అక్కడే ఉన్నారు. ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ‘పోలీసులు డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారిని మంత్రి సురేఖ సమక్షంలోనే పిలిచి విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గీసుగొండ/హనుమకొండ, అక్టోబర్ 13: పోలీస్‌స్టేషన్‌కు మంత్రి సురేఖ వచ్చి పోలీసులపై చర్యలు తీసుకునేదాకా అక్కడే కూర్చుంటానని చెప్పడంతో వరంగల్ సీపీ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ పెద్దల నుంచి సురేఖకు ఫోన్ రావడంతోనే ఆమె పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు రావాలని, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి వస్తున్నారని, కూర్చొని మాట్లాడుదామని సురేఖకు రేవంత్ చెప్పినట్టు సమాచారం.
కొండా కుటుంబం అంటే గిట్టని కొందరు నీతిమాలిన పనులు చేస్తున్నారని, తమ కుటుంబంపై బురదజల్లే వ్యవహారాలను ఎండగడుతున్న తమవాళ్లను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబం వంటిదని, కొందరు పార్టీ కార్యకర్తలు, తమ అనుచరులను గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని తెలిసి తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. తాను స్టేషన్‌కు రావడంతో పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారని, అంతకుమించి అకడ ఏం జరగలేదని పేర్కొన్నారు.