హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తాను చెప్పాల్సింది చెప్పానని, అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటిస్తానని స్పష్టం చేశారు. తన మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో జరిగిన వివాదంపై గురువారం మీనాక్షి నటరాజన్‌ను కలిసి సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఆలోచనలు, ఇబ్బందులను సమావేశంలో చెప్పానని, నిర్ణయాన్ని వారికే వదిలేశానని తెలిపారు. సుమంత్ వివాదంపై తొలుత సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సురేఖ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య అరగంటకుపైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అండగా ఉంటానని మంత్రి సురేఖకు భట్టి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
అనంతరం క్యాబినెట్ సమావేశానికి వెళ్లకుండా మంత్రుల నివాసంలో ఉన్న మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సైతం అక్కడికి రావడంతో ముగ్గురి మధ్య దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన పరిణామాలు, తన ఇంటికి పోలీసులను పంపిన వైనాన్ని మంత్రి సురేఖ వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రినైన తన ఇంటిపైకి రాత్రివేళ పోలీసులను ఎలా పంపిస్తారని, తన ఓఎస్డీపై అవినీతి ముద్రవేసి తనను అవమానించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పూస గుచ్చినట్టు మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్టు సమాచారం. ఆమె ఆవేదనను విన్న మీనాక్షి ఆందోళన చెందవద్దని, మీడియాకు ఎక్కి ఇబ్బంది పెట్టవద్దని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇందుకు కారణమైన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.
తాజా పరిణామాలపై కలత చెందిన మంత్రి సురేఖ గురువారం జరిగిన క్యాబినెట్ భేటీని బహిష్కరించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారని, దేవాదాయశాఖ ఫైళ్లను ఇతర శాఖలకు అప్పగించాలని, దేవాదాయ ఉద్యోగులెవరూ ఆమెకు రిపోర్ట్ చేయవద్దని.. ఇలా ముఖ్యనేతల అనుచరుల నుంచి మీడియాకు లీకులు వెళ్లాయి. దీంతో కలత చెందిన సురేఖ క్యాబినెట్ మీటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. సచివాలయానికి వచ్చి భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.