హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): శాసనసభ బయట, శాసనసభలో తనదైనశైలి వ్యాఖ్యలతో ప్రజాక్షేత్రం, సామాజిక మాధ్యమవేదికల్లో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్న రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. సోమవారం సచివాలయంలో సినీనిర్మాతలతో సమావేశం తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిలో కోమటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించడం వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిందని ఆరోపించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఒక మంత్రిగా ఉంటూ క్షుద్రపూజల పేరిట అవాకులు, చెవాకులు పేలడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్లు క్షుద్రపూజలు చేయించినట్టా? అని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజినీర్ల వద్ద రూ.50 వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఉన్నాయని, అధికారుల వద్దే అంత డబ్బుంటే.. లీడర్ల వద్ద ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చన్న మంత్రి మాటలపై సెటైర్లు పేలుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.87 వేల కోట్లు అయితే.. అందులో పని చేసిన అధికారుల వద్ద రూ.60వేల కోట్లు ఎలా ఉంటాయని నిలదీస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు అజ్ఞానంతో లక్ష కోట్ల అవినీతి అంటూ తెలివితేటలు బయటపెట్టుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే తమ జిల్లాకు చెందిన మాజీ మంత్రికి షాబాద్‌లో 80 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందని మంత్రి ఆరోపించగా… హైదరాబాద్‌లోని గండిపేట జలాశయం చుట్టూ కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని హైడ్రా గుర్తించిందని, వాటి గురించి కోమటిరెడ్డి మాట్లాడాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం నిర్మించి, రూ.350 కోట్లు బకాయిలను తమ ప్రభుత్వంపై పెట్టిందని కోమటిరెడ్డి ఆరోపించారు. 32 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు కట్టామని బీఆర్ఎస్ గొప్పలు చెప్తున్నదని, వాటి నిర్మాణానికి చేసిన అప్పులను తమ ప్రభుత్వం కడుతున్నదని చెప్పుకొచ్చారు. అయితే.. కేసీఆర్ అప్పులు చేస్తే.. ఆ డబ్బులతో నిర్మించిన భవనాలు, ప్రాజెక్టులు కనిపిస్తున్నాయని, మరి కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో చేసిన రూ.2లక్షల కోట్లతో ఏం నిర్మించారో.. ఎక్కడ నిర్మించారో.. ఆ సొమ్ములు ఎవరి ఖాతాల్లోకి పోయాయో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఉప్పల్-నారపల్లి 8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం 2017 నుంచి పెండింగ్‌లో ఉందని, కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కానీ ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్‌ను కేంద్రం నిర్మిస్తున్నదనే విషయం కూడా తెలియకుండా కోమటిరెడ్డి అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. విలన్లది కొన్ని రోజులు మాత్రమే నడుస్తుందని, సీఎం రేవంత్, తాము ఎవర్గ్రీన్ హీరోలు అంటూ కోమటిరెడ్డి అభివర్ణించుకున్నారు. తమపై విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అయినా తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటంలేదని అన్నారు. ఇక సోషల్‌మీడియా దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే సంగతి మర్చిపోయినట్టు నటిస్తూ.. కోమటిరెడ్డి నీతులు చెప్పడం దారుణమని సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్ల తిరస్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీ.. అబద్ధపు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ప్రజలు ఆదరించారని, తాము హీరోలమంటూ సొంత డబ్బా కొట్టుకోవడం మానుకోకపోతే రేవంత్ అండ్ బ్యాచ్ ప్రజల మధ్యలో జోకర్లుగా మారిపోతారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల వ్యాఖ్యలు, పనితీరుపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని… మరింత దిగజారొద్దని చురకలు అంటిస్తున్నారు.