నల్లగొండ, మార్చి 24: కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరిస్తానని ఇటీవలే మాటిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డే ఆ మాట తప్పారు. నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులను గంటల తరబడి వేచి ఉంచారు. 12 గంటలకు వస్తానన్న మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చి కనీసం ప్రజావాణి మందిరానికి కూడా రాకుండానే వెళ్లిపోయారు. దీంతో బాధితుల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి నల్లగొండలోని ఆర్జాలబావి, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మధ్యాహ్నం ఒకటిన్నరకు కలెక్టర్ చాంబర్‌కు వచ్చారు. గంటపాటు చాంబర్లోనే ఉన్న మంత్రి ప్రజావాణి సమావేశ మందిరంలోకి రాకుండానే వెళ్లిపోయారు. అప్పటివరకూ వేచి ఉన్న బాధితులు మంత్రి వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెళ్లిన తర్వాత కలెక్టర్ ఇలా త్రిపాఠి వినతులను స్వీకరించగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు సాయంత్రం 4 గంటల వరకు కార్యాలయ ఆవరణలోనే తిండి తిప్పలు లేకుండా ఉండాల్సి వచ్చింది.