మహబూబాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్కపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రావడంలో ముఖ్యంగా సోనియాగాంధీ పాత్ర ఎంతో ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, తాను మంత్రి పదవిని త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర లేదనడంతో వేదికపై ఉన్న మంత్రులతోపాటు కింద కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. తెలంగాణ పదం ఎత్తితేనే అరెస్టు చేసే ఉమ్మడి రాష్ట్రంలో.. తెలంగాణ నినాదం ఎత్తుకొని, సుదీర్ఘంగా ఉద్యమం చేసి కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై ఇలా వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు మంత్రి కోమటిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి చర్చలో పాల్గొంటారని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని చర్చించవచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అన్నారు. రూ.1.50 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వం ఖర్చు చేస్తే పట్టుమని పదెకరాలు పారలేదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను చర్చకు రమ్మంటే కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి ముఖ్యమంత్రి రాలేదనడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమని ఇందుకు కేసీఆర్ సహకరించాలని కోరారు.
మహబూబాబాద్ రూరల్, జూలై 8 : తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్ అంగీకరించారు. సోమ్లాతండాలో మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని యూరియా పరిస్థితిని వివరించినట్టు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతోపాటు ఆరుగురు మంత్రులు వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు కలిసి మహబూబాబాద్‌లో ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, సర్పంచుల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని మహబూబాబాద్‌లోని ఎల్ఐసీ భవనం నుంచి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను, మాజీ సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.