Komatireddy Venkat Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. మంగళవారం నాడు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి హైదరాబాద్ బేగంపేట నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్లో బయల్దేరాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలు అయినా అక్కడకు చేరుకోలేదు.
తమను ఉదయం 9 గంటలకే రమ్మని చెప్పి.. 10 గంటలు దాటినా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతసేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్‌పోర్టు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి నాగార్జున సాగర్ బయల్దేరి వెళ్లారు. అక్కడ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.