నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.55 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సీసీ రోడ్ల పనులకు నల్లగొండ(Nallgonda) బైపాస్ రోడ్డు వద్ద శంకుస్థాపన చేసి మాట్లాడారు.
తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. 600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. 6 లైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
నల్గొండ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న హెల్త్ అండ్ హైజిన్ ఫుడ్ స్ట్రీట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.