హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతిపాదిత రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) గేమ్ చేంజర్ వంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ట్రిపుల్ ఆర్తోపాటు టిమ్స్ దవాఖానలు, జిల్లాల్లో పరిపాలనా పరమైన భవనాల నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు. కొత్త ఇంజినీర్లు తాము నిర్మించేవి రోడ్లో, భవనాలో అనుకోకుండా లక్షల మంది అవసరాలను తీర్చే కట్టడాలుగా భావించి పనిచేయాలని సూచించారు. గురువారం హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 156 మంది ఆర్అండ్బీ ఇంజినీర్లకు శాఖపరమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న 5 రోజుల ఒరియంటేషన్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరై ఇంజినీర్లకు మార్గనిర్దేశనం చేశారు. ఇంజినీర్ల రిక్రూట్మెంట్ ద్వారా ఆర్అండ్బీని పటిష్ఠం చేస్తున్నట్టు వివరించారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏదైనా సమస్య వస్తే తనతో చెప్పాలని ఇంజినీర్లకు సూచించారు. కొత్త ఇంజినీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని తమ కెరీర్లను నిర్మించుకోవాలని చెప్పారు.