నల్లగొండ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం ఎంతో గొప్ప విషయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati Reddy) అన్నారు. సోమవారం అయన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా(Korlapadu Toll Plaza) వద్ద ఏడీపీ సంస్థ ద్వారా సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ట్రామా కేర్ సెంటర్కు(Trauma Care Centre) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రథమ చికిత్స అందించేందుకు ఏడీపీ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి సమయంలో వారికి తక్షణ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హాస్పిటక్కు పంపించేందుకు ముందుగా ట్రామా కేర్ సెంటర్లో చికిత్స అందించేలా ఎకరం స్థలంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల ఏడీపీ సంస్థను అభినందించారు. దీనిని త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ 7న ట్రామా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీపీ సంస్థను కోరారు. ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.