నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఫుల్ లెవల్ నీళ్లున్నా.. ఒక్క చెరువు, కుంటకు నీళ్లొస్తలేవు. పోయిన ఎండాకాలంలోనే నీళ్లు లేక బోర్లు ఎండిపోయినయ్. తోటలు ఎండిపోయినయ్. ఈ సారి ఇక్కడ వర్షాలు సరిగ్గా పడలేదు. కర్ణాటకలో కురిసిన వర్షాలతో సాగర్‌కు నీళ్లొస్తున్నయ్. వచ్చిన నీళ్లతో చెరువులు నింపకుంటే ఎట్ల? ఏఎమ్మార్పీ నాలుగో మోటర్ ఇంకెప్పుడు నడుపుతరు? రైతులకు ఎప్పుడు నీళ్లిస్తరు? ఇవ్వాల్టి నుంచి ఫోర్త్ డే మోటర్ రన్ చేసి నీళ్లు ఇవ్వాల్సిందే. నేను చెప్తున్న.. సీఈ గారూ నీళ్లు ఇవ్వాల్సిందే’ అని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తమ ప్రభుత్వ అసమర్ధతపై అసహనం వ్యక్తంచేశారు. అది కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే ప్రశ్నించడం గమనార్హం.
శుక్రవారం నల్లగొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎల్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతంలో సమీక్ష నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్ హాజరయ్యారు. వీరందరి సమక్షంలోనే మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ అసమర్థతను ఒప్పుకొంటూ సీఈ అజయ్‌కుమార్‌ను నిలదీసినంత పనిచేశారు. వాస్తవంగా గత నెల 2న సాగర్ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు, లోలెవల్ కెనాల్ ఆయకట్టుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చిమరీ సాగునీటిని విడుదల చేశారు. కానీ నేటికీ ఏఎమ్మార్పీ, లోలెవల్ కెనాల్ ఆయకట్టులోని సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు సాగునీటికి నోచుకోలేదు.
ఇందుకు ప్రధాన కారణం ఏఎమ్మార్పీ నాలుగు మోటర్లలో ఒక మోటర్ గత అక్టోబర్‌లో మరమ్మతుకు గురవడం. సాధారణంగా జూలై నాటికే మోటర్లను సిద్ధం చేసుకుని సాగర్‌కు నీరు రాగానే తోడిపోస్తారు. కానీ.. ఈ మోటర్ రిపేర్‌ను ప్రభు త్వం పెడచెవిన పెట్టింది. తీరా నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద మొదలైనప్పుడు ప్రభుత్వం హడావుడిగా మొదలుపెట్టింది. వెంటనే పూర్తి చేసి గత నెల 31 నాటికే నాలుగో మోటర్ రన్ చేసి సాగునీటిని సమృద్ధిగా అందిస్తామని ప్రకటించింది. నేటికీ ఆ మోటర్ వినియోగంలోకి రాలేదు. దీంతో లోలెవల్ కెనాల్తోపాటు ఏఎమ్మార్పీ డీ-37, 39, 40 పరిధిలోని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేస్తూ.. కనిపించిన ప్ర తి అధికారికీ వినతిపత్రాలు సమర్పిస్తున్నా ఫలితం లేదు. రైతుల ఆందోళనలతో మం త్రి కోమటిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ అసమర్ధతను బయటపెట్టక తప్పలేదన్న వ్యాఖ్యలు సమావేశంలోనే వినిపించడం చర్చనీయాంశమైంది.