హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారుతారేమోనన్న భయంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అమెరికా వెళ్లి ఆయనను కలిసి వచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం బీఆర్ఎస్కు పట్టుకున్నదని ఆరోపించారు.
కోమటిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు అమెరికా వెళ్లి వచ్చిన వివరాలు అన్ని తన వద్ద ఉన్నాయని చెప్పారు. గతనెల 26న ఎమిరేట్స్ ైఫ్లైట్ నంబరు ఈకే 525లో అమెరికాకు వెళ్లారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును ఇండియాకు రాకుండా ఆపేందుకే హరీశ్‌రావు అమెరికా వెళ్లారని ఆరోపించారు.
గుట్టుచప్పుడు కాకుండా ఆయన అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభాకర్‌రావు ఎక్కడ అప్రూవర్‌గా మారుతారోనని భయపడుతున్నారని ఆరోపించారు. అమెరికా వెళ్లి ప్రభాకర్‌రావును కలవలేదని హరీశ్‌రావు ప్రమాణం చేస్తారా? అని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు.