నేను ఎలాంటి హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు..ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు.. – జూపల్లి కృష్ణారావు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 12 ( నమస్తే తెలంగాణ): ‘మా ప్రభుత్వం మళ్ల వస్తదో లేదో తెలియదు..నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఒకవేళ గెలిచినా..మా పార్టీ గెలుస్తదో లేదో తెలియదు..అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను’ అంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో గురువారం ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ ‘నేను ఎలాంటి హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు..ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు.. సమస్యల పరిష్కారానికైతే కృషి చేస్తా’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు కామెంట్లతో ఆడుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో సైతం మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశానికి దారి తీశాయి.