హైదరాబాద్, సెప్టెంబర్13(నమస్తే తెలంగాణ): ప్రజల ప్రాణాలు ఎట్ల పోయినా తమకు నిధుల రాబడే ప్రధానమని పాలకులు మరోసారి రుజువు చేశారు. మద్యం మాఫియా అక్రమంగా తరలించే నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్ )ను ఇకపై ధ్వంసం చేయొద్దని సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈ మద్యాన్ని జాతీయ ఉత్పత్తిగా గుర్తించి ప్రజలకు విక్రయించాలని వివాదాస్పద సూచనలు చేశారు. నకిలీ ‘మద్యం దందా నెలకు రూ200 కోట్లు’ అనే శీర్షికతో శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనానికి ఎక్సైజ్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఈమేరకు శుక్రవారం రాత్రే ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వారం రోజుల గ్రౌండ్ స్టాక్ నిబంధనను అమల్లోకి తేగా.. శనివారం ఆబ్కారీ భవన్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఎస్టీఎఫ్ అండ్ డీటీఎఫ్ టీమ్‌లతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సూచనలపై వివాదం చెలరేగింది. దొంగ మద్యం ఏరూపంలో సరఫరా చేసినా అది ప్రజల ప్రాణాలకే ముప్పు అనే కనీస అవగాహన లేకుండా మంత్రి జూపల్లి సూచన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో చీప్ లిక్కర్ నుంచి మొదలుకొని ప్రీమియం లిక్కర్ వరకు ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను వాడుతారని, ముడి ఆల్కహాల్‌ను అనేకసార్లు ఫ్యూరిఫైడ్ చేస్తే ఈఎన్ఏ వస్తుందని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ మద్యాన్ని వినియోగించేటట్టు చూడాలనే సూచన చేయడంపై ఎక్సైజ్ అధికారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్డీపీఎల్, నకిలీ మద్యం గుర్తించలేనంత దగ్గర పోలికలతో ఉంటాయని, నకిలీ మద్యంలో అప్పుడప్పుడు ఇథైల్ ఆల్కహాల్ బదులుగా, మిథైల్ ఆల్కహాల్ కలిసిపోతుందని, అదే జరిగితే ప్రాణాలు పోతాయని చెబుతున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన మరణాలకు ఇలాంటి మద్యమే కారణమని వాపోతున్నారు. ఎక్సైజ్ పరిభాషలో దీనిని డెత్ స్పిరిట్‌గా పిలుస్తారని చెబుతున్నారు. మిథనాల్ నింపిన మద్యం సీసాలు ప్రభుత్వం తరఫున విక్రయిస్తే జరిగే పెను ప్రమాదానికి బాధ్యులెవరిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎస్టీఎఫ్ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైతే ఆయుధాలను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి తెలిపారు. ఒకే బార్ లైసెన్స్‌పై ఎకువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.