కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది. జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో నామమాత్రం సమీక్ష నిర్వహించి ముగించడంపై వరద బాధితులు, పంటలు దెబ్బతిన్న రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పలు మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. మంత్రి బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో 6,453 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం కలిగిందని, 47 పశువులు చనిపోయాయని, 23 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖలకు చెందిన 8 రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే కుమ్రంభీం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని మంత్రి జూపల్లిని కోరారు. లక్ష్మాపూర్, అనర్పల్లి వంతెనలు నిర్మిస్తే గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని చెప్పారు. రోడ్ల నిర్మాణాలకు టెండర్లు నిర్వహించిన తర్వాత కూడా పనులు ముందుకు సాగడం లేదని మంత్రి దృష్టికితీసుకెళ్లారు. వరద నష్టాలపై మంత్రి హామీలు ఇవ్వకుండా ఇరవై నిమిషాల్లో సమీక్షను ముగించడంతో బాధితుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.