Telangana | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భారీ అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తున్నది. సరఫరాదారులతో కొందరు మత్స్యశాఖ అధికారులు కుమ్మక్కై అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరఫరాదారులిచ్చే తాయిలాలకు ఆశపడి ఈ పథకానికి తూట్లు పొడుస్తూ మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు (డీఎఫ్వోలు) చేపపిల్లల పంపిణీలో అవినీతే పరమావధిగా పని చేస్తున్నారని, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా నాసిరకమైన, చనిపోయిన చేపపిల్లల్ని పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీన్ని బట్టే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
మంత్రికే షాక్ ఇచ్చిన అధికారులు
ఇటీవల తన నియోజకవర్గంలోని చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేసేందుకు వెళ్లిన మంత్రి జూపల్లి.. అక్కడి పరిస్థితిని చూసి షాక్కు గురయ్యారు. చేపపిల్లలు చిన్నసైజులో నాసిరకంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చేపపిల్లల్ని వెనక్కి పంపేయాలని ఆదేశించారు. చివరికి వాటిని పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. జగిత్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నిబంధనల ప్రకారం రిజర్వాయర్లలో వేసే చేపపిల్లలు 80-100 మిల్లీమీటర్ల పరిమాణంలో, చెరువుల్లో వేసే చేపపిల్లలు 35-40 మి.మీ. ఉండాలి. అధికారులు అంతకన్నా తక్కువ సైజు పిల్లల్ని తీసుకొస్తున్నట్టు తెలిసింది.
తూకం లేకుండానే పంపిణీ
సరఫరాదారులతో అధికారులు కుమ్మక్కై తూకం వేయకుండానే చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. తక్కువ చేపపిల్లలను పంపిణీచేసి, రికార్డుల్లో మాత్రం ఎక్కువ చేపపిల్లలను పంపిణీ చేసినట్టు నమోదు చేస్తున్నారు. దీంతో సరఫరాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ఘటనలు జగిత్యాల జిల్లాలో అధికంగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కిలోకు 250-300 చేపపిల్లలు ఉండాలి. వాస్తవానికి సగమే పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సీజన్లో 25 కోట్ల చేపపిల్లలతో సరి
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా దాదాపు 80 కోట్ల చేపపిల్లల్ని పంపిణీ చేసింది. కానీ, ప్రస్తుత సీజన్లో 40 కోట్ల చేపపిల్లల్ని మాత్రమే పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఇప్పటివరకు కేవలం 23 కోట్ల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసిన రేవంత్రెడ్డి సర్కారు.. మరో ఒకటి లేదా రెండు కోట్ల చేపపిల్లలను పంపిణీచేసి, ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను ముగించేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.