Telangana | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా ఈ-రేసును భాగ్యనగరానికి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాజధాని వైపు చూసేలా చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేసు నిర్వహణలో తప్పులు జరిగాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
ఈవెంట్ నిర్వహణ సంస్థకు రూ.54 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వరుస విచారణలకు పిలిచి, ప్రశ్నలు సంధించింది. కానీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు ఏసీబీ ఏమీ తేల్చలేదు. ఇదొక తప్పుడు కేసు అని, లొట్టపీసు కేసు అని కేటీఆర్ పదేపదే చెప్పారు. ఆ కేసు ఏమైందో ఏసీబీకి కూడా తెలియదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. రాష్ర్టానికి రూ.700 కోట్ల ఆదాయం సమకూర్చిన ఈవెంట్‌ను రద్దు చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కారు చేజేతులా ఈ ఏడాది రావాల్సిన ఆదాయానికి తూట్లు పొడిచినట్టయిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అందాల పోటీల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో ఫార్ములా ఈ-రేసు ఘనత మరోసారి చర్చకు వచ్చింది.
హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహిస్తే తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నది. పర్యాటక అభివృద్ధి కోసమే అందాల పోటీలు అంటున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు మరో అడుగు ముందుకు వేసి, అందాల పోటీలతో మహిళా సాధికారత సాధ్యమని చెప్తున్నారు. అందాల పోటీలకు పెద్దగా విశిష్టత ఏమీ లేదు. కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్ములా ఈ-రేసింగ్ భారత్‌లో తొలిసారి, అదీ హైదరాబాద్‌లో జరిగితే మనకు ఖ్యాతి వచ్చినట్టు కాదా? అవినీతి జరిగినట్టా? అంటూ బీఆర్ఎస్ నేతలు, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.700 కోట్లు ఆదాయం తీసుకొచ్చే ఈవెంట్‌కు రూ.54 కోట్లు ఇస్తే అవినీతి అన్నారు, పైసా ఆదాయం లేని అందాల పోటీలను రూ.54 కోట్ల వ్యయంతో నిర్వహించడం, అందులో సగం సర్కారు భరించడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి కేవలం బురదజల్లేందుకు మాత్రమే కేటీఆర్‌పై కేసు పెట్టినట్టు తేలింది కదా అని నిలదీస్తున్నారు.
అందాల పోటీలకు ప్రభుత్వం ఆతిథ్యమివ్వడం, ప్రజాధనాన్ని వెచ్చించడం పట్ల విపక్షాలు, మహిళా సంఘాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కారు అందాల పోటీలకు రూ.250 కోట్లు ఇస్తూ, లెక్కలు దాస్తున్నదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 సహా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టుపెట్టిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిధులు లేవంటూ మాట తప్పారని మండిపడుతున్నారు. అంగన్వాడీ సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న సర్కారు అందాల పోటీలకు నిధులెలా ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అంగన్వాడీలలో ఏండ్ల తరబడి పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.50 కోట్లు ఇవ్వడానికి కూడా ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వానికి అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా, కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయకుండా అందాల పోటీలు నిర్వహించడాన్ని మహిళా సాధికారతకు నిదర్శనంగా చూడాలని మంత్రి ప్రకటించడం దారుణమని ఎస్‌హెచ్‌జీ ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు. సర్కారు తీరు..కడుపు గంజికి ఏడిస్తే.. సిగ మల్లెపూలకు ఏడ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
అందాల పోటీలు నిర్వహించవద్దంటూ గతంలో మహిళలు ఆందోళనలు నిర్వహించిన సంగతి సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదా అని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. బీఆర్ఎస్పై రేవంత్ విషప్రచారం చేయడం దుర్మార్గమని, అందాల పోటీలు వద్దంటే ఎదురుదాడి చేయడమేంటని నిలదీశారు.
రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అందాల పోటీలు కాదని, ఆరు గ్యారెంటీల అమలు అని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన కేటీఆర్ ఇంటి తలుపులను విధ్వంసం చేస్తామంటూ బెదిరించడం కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు పునరాలోచనలో పడ్డారని, కాంగ్రెస్ సర్కారురు ప్రజలే సరైన సమాధానం చెప్తారని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 72వ ప్రపంచ అందాల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం అతిథ్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మే 7 నుంచి 31 వరకు రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 24 ఈవెంట్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈవెంట్ల కోసం ఖర్చయ్యే రూ.54 కోట్లలో ప్రభుత్వం, నిర్వాహకులు సగం సగం భరించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ ‘అందాల పోటీలు మహిళా సాధికారతకు ప్రతీక’గా చూడాలని సూచించారు.
పోటీలకు 140 దేశాల ప్రతినిధులు హాజరువుతారని, ప్రపంచం దృష్టి తెలంగాణపై పడుతుందని తెలిపారు. అందాల పోటీల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి చాలా గొప్పదని కొనియాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి వారిని సందర్శించడం చాలా మంచి అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.