హైదరాబాద్ : నాగార్జునసాగర్(Nagarjunasagar), బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) తెలిపారు. శుక్రవారం అయన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కమలేష్ డి.పాటిల్ (దాజి)తో కలిసి పరిశీలించారు. ముందుగా విజయ విహర్లో బుద్ధవనం లే-అవుట్, విజయ విహార్ లేఔట్లను పరిశీలించారు.మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బుధవనంలో ఉన్న విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డి మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నాగార్జునసాగర్, బుద్ధవనానికి ఆసియా ఖండంలోని పలు దేశాల నుంచి బౌద్ధులు ఇక్కడికి వస్తారన్నారు. ప్రత్యేకించి శ్రీలంక, ఇతర ఆసియా ఖండాల నుంచి ఎక్కువ మంది వస్తారని, వారికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం నిర్మాణాలు చేపడుతామన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా మంత్రి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను ఆదేశించారు.