మహబూబ్నగర్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దళితులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో గురుకుల పాఠశాల భవనం కోసం భూమిని ఎంపిక చేయడంతో న్యాయం చేయాలని అడిగిన దళితులను సెక్యూరిటీ పెట్టి అడ్డగించిన మంత్రి జూపల్లి నిర్వాకంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దళితులపై మంత్రి జూపల్లి చిర్రుబుర్రు’ కథనానికి ఆయన ఎక్స్ వేదికగా స్పం దించారు. అన్యాయం జరుగుతున్నదని, న్యాయం చేయండని వచ్చిన దళితులపై ఇంత కర్కశత్వమా? అని మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. దళిత బిడ్డలు మీ భూములివ్వమని అడగలేదని, వారికి గతంలో ఇచ్చిన భూములను తీసుకోకుండా న్యాయం చేయాలని అడిగారని పేర్కొన్నారు. అంతమాత్రాన తీవ్రస్వరంతో గద్దిస్తూ సెక్యూరిటీని పెట్టి బాధిత దళితులను బయటకు పంపిస్తారా? ఇందిరమ్మ రాజ్యం లో దళితులకు న్యాయం చేయరా? అని ప్రశ్నించారు. అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొదలవుతుందన్న సహజ సూత్రాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు.