సూర్యాపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ): కరెంటు ఫైల్స్‌పై చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మాజీ, తాజా బాస్ అని చెప్పుకొంటున్న చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్‌పై బహిరంగ చర్చకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడీనా? అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్తు విషయంలో పారదర్శకతకు సీఎం కేసీఆర్ పాలన పెట్టింది పేరు అని, ఇందులో దాపరికం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్తు విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం చేసుకున్న ఫైల్స్‌పై చర్చ జరగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై స్పందించారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు పాలనలో, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒప్పంద ఫైల్స్‌ను కూడా బహిర్గతం చేసి చర్చకు దిగుదామని రేవంత్‌కు సవాల్ విసిరారు.
24 గంటల విద్యుత్తు సరఫరాలో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిన దొంగ అని, ఇప్పుడు ఏఐసీసీని రంగంలోకి దించి బుకాయింపు చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. డ్రామాలతో తెలంగాణ రైతాంగాన్ని మరోమారు మోసం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ దుర్మార్గాలకు నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థులయ్యారని మంత్రి ధ్వజమెత్తారు. 2014కు ముందు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఏనాడైనా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే సాగర్ ఎడమ కాల్వ కింద భూములకు వరుసగా 16 పంటలకు నీళ్లు ఇచ్చామని, దాని ఫలితమే ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సాధించామని చెప్పారు. 24 గంటల విద్యుత్తుపై ఏఐసీసీ ఆదేశాలనే టీపీసీసీ పాటిస్తున్నదని, దీనిపై చర్చ జరగాల్సిందేనని, అందుకు రైతు వేదికలు, రచ్చబండలు వేదిక అవుతాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కొనేందుకు ఇక్కడి రైతాంగం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. మూడు గంటల కరెంటు అన్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని, మూడు పంటలకు నీళ్లు ఇస్తున్న సీఎం కేసీఆర్ పక్షాన రైతాంగం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.