నల్లగొండ, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. దమ్ముంటే ఇతర అన్ని పథకాలను కూడా రద్దు చేస్తామని చెప్పాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్ ఇలా అన్ని పథకాలను కూడా రద్దు చేయాలనే దుర్మార్గమైన ఆలోచనలు కూడా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పైరవీలు, అక్రమాలు, ప్రజల పథకాలతో సొంత జేబులు నింపుకోవడం పరిపాటైన కాంగ్రెస్ నేతలకు నేరుగా ప్రతిపైసా ప్రజలకు చెందడం నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో తెలంగాణలో జరిగిన దుర్మార్గాలకు కాంగ్రెస్ నేతలు వెయ్యిసార్లు క్షమాపణలు, లక్ష సార్లు ముక్కు నేలకు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణకు చేసిన అన్యాయాలకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాయక తప్పదని అన్నారు. నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్కుమార్తో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాం డ్ చేయడంపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలో పెత్తనం కోసం నేతల మధ్య పోరులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల గొంతులు పెకులుతున్నాయని విమర్శించారు.
జానారెడ్డి ఏం చేసిండు?
తెలంగాణ ఏర్పాటైన ఆరేండ్లలోనే ఒక్క ఫ్లోరైడ్ కేసు లేకుండా ఇంటింటికీ మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నా రు. జానారెడ్డిని ఆరుసార్లు గెలిపించినా ఎడ మ కాల్వపై మొదటి మేజర్ రాజవరానికే సాగునీళ్లు ఇవ్వలేకపోతే కేసీఆర్ ఇచ్చింది అక్కడి రైతులు చెప్పరా? అని ప్రశ్నించారు.
మీ కంటే ఢిల్లీ, పంజాబ్ సీఎంలు నయం..
నిజంగా ప్రజలకు మేలు చేయాలన్నదే లక్ష్యమైతే ఢిల్లీ, పంజాబ్ సీఎంల మాదిరిగా ఎక్కడ మంచి పథకాలు ఉన్నా వాటిని తమ రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి సూచించారు. కంటి వెలుగును తమ రాష్ర్టాల్లో అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ఈ రకమైన పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌కు ఓటు..
కర్ణాటకలో బీజేపీ దుర్మార్గాలను భరించలేని ప్రజలు ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్‌ను గెలిపించారని జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆ అవకాశం లేదని స్పష్టం చేశారు. అక్కడ కూడా బీఆర్ఎస్ ఉండి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదని అన్నారు. తెలంగాణలో ఏదో జరుగుతుందని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.