Minister Jagadish Reddy | సూర్యాపేటలో రౌడీయిజం చేస్తామంటూ సహించేది లేదని, వారిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసునని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికలు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన గృహలక్ష్మి లబ్ధిదారులదారుల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ కొందరు రౌడీ రాజ్యం తీసుకు రావాలని, రౌడీయిజం చెలాయించాలని చూస్తున్నారని, అలాంటి వారిని తాను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించామన్నారు. అందులో భాగంగా విశాలమైన రోడ్లను, సుశాలమైన నూతన కూరగాయల మార్కెట్, సూర్యాపేటకు తలమానికంగా మారిన మెడికల్ కళాశాల, అన్ని కార్యాలయాల సమూహంగా ఉన్న కలెక్టర్ కలెక్టరేట్ నూతన భవనం, ఎస్పీ నూతన కార్యాలయం, మినీ ట్యాంక్ బండ్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. అన్ని కులాలు తమవృత్తిలో సాఫీగా సాగిపోయేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. దళితులను తన జీవన సరళిని మార్చుకునేలా దళితబంధు ఇచ్చామన్నారు.
ఇక మిగిలింది గృహ నిర్మాణం ఒకటే అయినందున.. గృహలక్ష్మి పేరుతో ప్రజలకు మంజూరీ పత్రాలను అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో సుమారు 6వేల నుంచి 7వేలమంది లబ్ధిదారులుంటారని సర్వేలో వెల్లడైనట్లు తేలిందన్నారు. ప్రస్తుతం మొదటి విడతగా 3వేల ఇళ్లను మంజూరు చేసే దిశగా ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇండ్లురాని వారు ఎలాంటి కలత చెందాల్సిన పనిలేదన్నారు.
నిజమైన అర్హులకు గృహలక్ష్మి పథకం తప్పక అందుతుందన్నారు. ఈ పథకం ఒక్క రోజుతో పోయేది కాదని, ఇది నిరంత ప్రక్రియగా పేర్కొన్నారు. ఏ సమస్యను ఒకేసారి పరిష్కరించుకోలేమని, క్రమక్రమంగా వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా పొరపాట్లు జరిగితే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నాయకులు, అధికారులు వద్ద తప్పు జరిగినట్లు తెలితే తాను సహించబోనని ప్రజలకు తేల్చి చెప్పారు.