Jagadish Reddy | సూర్యాపేట : ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ పండుగ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట విద్యానగర్లో మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులతో కలిసి బతుకమ్మను పేర్చి ఆశ్చర్యపరిచారు. తీరొక్క పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో మంత్రి సతీమణి సునీత, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, పలువురు మహిళలు పాల్గొన్నారు. సునీత జగదీష్ రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో మంత్రి నివాసం మార్మోగిపోయింది.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిబింబం అన్నారు. మహిళలకు ప్రతిబింభం అయిన పూలను ఆరాధించమంటే వారిని గౌరవించడమే అన్నారు. ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా, ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ బతుకమ్మ పండుగ సంస్కృతి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేసింది అన్నారు. మధ్యలో కొంత నిరాదారణకు గురైన బతుకమ్మ పండుగను ఇంటికి ఇంటికి చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే అన్నారు. రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేయడంలో బతుకమ్మ పండుగ ప్రముఖ పాత్ర వహించింది అన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకలు సూర్యాపేటలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు.
రాష్ట్రంలో వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సూర్యాపేట కూడా ఉంటుందన్నారు. సద్దుల చెరువు ట్యాంకుబండ వద్ద నిర్వహించే వేడుకల్లో వేలాది మంది ఆడపడుచులు పాల్గొంటారని తెలిపారు. ఆడపడుచులు అంతా ఒకచోట చేరి సాంప్రదాయం ఉట్టిపడేలా, ఊరంతా ఒకటై తమలో బీదా గొప్పా వర్ణం, వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారని అన్నారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయన్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందన్నారు. అందుకే బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ, బతుకమ్మ అంటే పూల పండుగ, బతుకమ్మ అంటే మనిషి ప్రకృతితో మమేకం అయ్యే అత్యంత అరుదైన అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.