జూలూరుపాడు, సెప్టెంబర్ 09 : జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అత్యవసర మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాముకాటు, కుక్క కాటుకు వినియోగించే ఏఎస్వీ, ఏఆర్వీ ఇంజెక్షన్లను ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నందున సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ అన్నారు. ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రతి శుక్రవారం డ్రై డే – ఫ్రై డే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక పాఠశాలలు, వసతి గృహాలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పల్లెల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా చూడాలని, ముఖ్యంగా మురికివాడల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, హెడ్ నర్స్ ఇందిర, నర్సింగ్ ఆఫీసర్ జాన్బీ, ఫార్మసీ ఆఫీసర్ శశికళ, హెల్త్ విజిటర్లు రాధిక, ప్రియదర్శిని తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అత్యవసర మందుల కొరత లేకుండా చూసుకోవాలి : డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్